చెలరేగిన పృథ్వీషా, ధావన్, రైనా శ్రమ వృథా, చెన్నైపై క్యాపిటల్స్ ఘన విజయం
ముంబై: ఐపిఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కళ్లు చెదిరే శుభారంభం చేసింది. శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 18.4 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు పృథ్వీషా, శిఖర్ ధావన్ విధ్వంసక బ్యాటింగ్‌తో ఢిల్లీని గెలిపించారు. చెలరేగి ఆడిన పృథ్వీషా 38 బంతుల్లోనే 9 ఫోర్లు, మూడు సిక్సర్లతో 72 పరుగులు చేశాడు. మరోవైపు కీలక ఇన్నింగ్స్ ఆడిన ధావన్ 54 బంతుల్లో పది ఫోర్లు, రెండు సిక్స్‌లతో 85 పరుగులు సాధించాడు. ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు 138 పరుగులు జోడించారు.
ఆరంభంలోనే..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ డుప్లెసిస్ (౦)ను అవేస్ ఖాన్ ఔట్ చేశాడు. అతను ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. అదే స్కోరు వద్ద మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కూడా వెనుదిరిగాడు. ఒక ఫోర్‌తో 5 పరుగులు చేసిన గైక్వాడ్‌ను క్రిస్ వోక్స్ వెనక్కి పంపాడు. దీంతో చెన్నై ఏడు పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది.
ఆదుకున్న మొయిన్, రైనా
ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను మొయిన్ అలీ, సురేశ్ రైనా తమపై వేసుకున్నారు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. ఒకవైపు వికెట్లను కాపాడుకుంటూనే చెత్త బంతులను ఫోర్లు, సిక్స్‌లుగా మలుస్తూ స్కోరు పరిగెత్తించారు. రైనా కాస్త జాగ్రత్తగా ఆడగా మొయిన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడి చేసిన మొయిన్ 24 బంతుల్లోనే రెండు సిక్సర్లు, మరో 4 ఫోర్లతో 36 పరుగులు చేసి అశ్వి బౌలింగ్‌లో ఔటయ్యాడు. అప్పటికే మూడో వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడు.
మొయిన్ ఔటైనా రైనా తన జోరును కొనసాగించాడు. అతనికి అంబటి రాయుడు అండగా నిలిచాడు. ఇటు రైనా, అటు రాయుడు ధాటిగా ఆడుతూ స్కోరు వేగాన్ని మరింత పెంచారు. ఇద్దరు చెలరేగి పోవడంతో సిఎస్‌కె స్కోరు 100 పరుగులు దాటింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన రాయుడు రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 23 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ వెంటనే రైనా కూడా పెవిలియన్ చేరాడు. చెలరేగి ఆడిన రైనా 36 బంతుల్లోనే 4 భారీ సిక్సర్లు, మరో మూడు ఫోర్లతో 54 పరుగులు చేసి రనౌటయ్యాడు. ఇక చివర్లో జడేజా, శామ్ కరన్ కూడా చెలరేగి ఆడారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన కరన్ రెండు సిక్స్‌లు, 4 ఫోర్లతో 34 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. జడేజా కూడా 3 ఫోర్లతో వేగంగా 26 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. దీంతో చెన్నై స్కోరు 7 వికెట్లకు 188 పరుగులకు చేరింది.