ఐపిఎల్ సీజన్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసింది. ఢిల్లీకి ఇది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లిలు శుభారంభం అందించినా ఫలితం లేకుండా పోయింది. ధాటిగా ఆడిన సాల్ట్ 17 బంతుల్లోనే 3 సిక్స్‌లు, 4 ఫోర్లతో 37 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. కోహ్లి 2 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 22 పరుగులు సాధించాడు.
అయితే దేవ్‌దుత్ పడిక్కల్ (1), లివింగ్‌స్టోన్ (4), జితేశ్ శర్మ (3) విఫలమయ్యారు. కెప్టెన్ రజత్ పటిదార్ (25) పరుగులు చేశాడు. చివర్లో టిమ్ డేవిడ్ 20 బంతుల్లోనే 4 సిక్సర్లు, రెండు ఫోర్లతో 37 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 17.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. కెఎల్ రాహుల్ 53 బంతుల్లోనే ఆరు సిక్సర్లు, ఏడు ఫోర్లతో 93 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ట్రిస్టన్ స్టబ్స్ 38 (నాటౌట్) అతనికి సహకారం అందించాడు.