విశాఖపట్నం: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మరో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ నాలుగు ఓవర్లు మిగిలి ఉండగా.. 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ జట్టు ఢిల్లీ బౌలర్ల ధాటికి కుప్పకూలిపోయింది. 18.4 ఓవర్లలో 163 పరుగులు చేసి ఆలౌట్ అయింది. హైదరాబాద్ బ్యాటింగ్‌లో అనికేత్ వర్మ 74, క్లాసెన్ 32, హెడ్ 22 పరుగులు చేయగా.. ఢిల్లీ బౌలింగ్‌లో స్టార్క్ ఐదు వికెట్లు, కుల్దీప్ మూడు, మోహిత్ ఒక వికెట్ తీశారు.
ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్.. బ్యాట్స్‌మెన్లు.. ఆరంభం నుంచి దూకుడుగా ఆడారు. ఢిల్లీ ఆటగాళ్ల బ్యాటింగ్‌కి సన్‌రైజర్స్ బౌలర్లు కళ్లెం వేయలేకపోయారు. తొలి వికెట్‌కి మెక్‌గ్రాక్, డుప్లెసిస్‌లు కలిసి 81 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఈ క్రమంలో డుప్లెసిస్ అర్థశతకం కూడా సాధించాడు. ఈ దశలో బౌలింగ్‌కి వచ్చిన జీషన్ అన్సారీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. డుప్లెసిస్, మెక్‌గ్రాక్‌లను ఒకే ఓవర్‌లో పెవిలియన్‌కి పంపిన అన్సారీ.. ఆ తర్వాతి ఓవర్‌లో కెఎల్ రాహుల్‌ని క్లీన్ చేశాడు. వికెట్లు పడిన ఢిల్లీ బ్యాటర్లను సన్‌రైజర్స్ కట్టడి చేయలేకపోయారు. దీంతో 16 ఓవర్లలోనే ఢిల్లీ 166 పరుగులు చేసి ఈ టోర్నమెంట్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది.