Thursday, December 19, 2024

నిష్పాక్షిక, పారదర్శక చట్ట ప్రక్రియను ప్రోత్సహించండి

- Advertisement -
- Advertisement -

కేజ్రీవాల్ అరెస్టుపై భారత్‌కు యుఎస్ హితవు
ఇప్పటికే జర్మనీ జోక్యంపై భారత్ ఆక్షేపణ
ఇప్పుడు కేంద్రం ఏమంటుందో?

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ అరెస్టు వార్తలను అమెరికా ప్రభుత్వం పరిశీలిస్తోంది. జైలు నిర్బంధంలో ఉన్న ఢిల్లీ సిఎం, ప్రతిపక్ష నేత విషయమై‘నిష్పాక్షికంగా, పారదర్శకంగా, సకాలంలో చట్ట ప్రక్రియ’ సాగేలా చూడవలసిందని భారత ప్రభుత్వాన్ని అమెరికా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని యుఎస్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఈ వారం రాయిటర్స్‌తో చెప్పారు. అభియోగాలు ఎదుర్కొంటున్న ఏ ఇతర భారత పౌరుని వలెనే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, ఢిల్లీ సిఎం కూడా న్యాయమైన, నిష్పాక్షికమైన విచారణకు అర్హుడని జర్మనీ విదేశాంగ శాఖ సూచించిన కొన్ని రోజులకే అమెరికా నుంచి ఈ స్పందన రావడం గమనార్హం. ‘న్యాయవ్యవస్థ స్వతంత్రత, మౌలిక ప్రజాస్వామిక సూత్రాలకు సంబంధించిన ప్రమాణాలను ఈ కేసులో కూడా పాటిస్తారని మేము భావిస్తున్నాం, ఆశిస్తున్నాం’ అని జర్మన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి శుక్రవారం పేర్కొన్నారు.

ఆ వ్యాఖ్యకు భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. భారత ప్రభుత్వం జర్మన్ దౌత్యవేత్తను పిలిపించడమే కాకుండా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వ్యాఖ్యను ‘ఆంతరంగిక వ్యవహారాల్లో ఉద్దేశపూర్వక జోక్యమే’ అని గర్హించింది. ‘అటువంటి వ్యాఖ్యలన మా న్యాయవ్యవస్థ ప్రక్రియలో జోక్యంగాను, మా న్యాయవ్యవస్థ స్వతంత్రతను కించపరచడంగాను పరిగణిస్తాం’ అని విదేశాంగ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.‘పాక్షిక భావనలు అత్యంత అవాంఛితం’ అని విదేశాంగ శాఖ పేర్కొన్నది.

‘జర్మనీకి భారత్ నిరసన వ్యక్తం చేయడం గురించి ప్రశ్నించినప్పుడు ‘భారత ప్రభుత్వంతో వారి చర్చలపై వ్యాఖ్యకు జర్మన్ విదేశాంగ మంత్రిత్వశాఖను అడగాలని మీకు సూచిస్తున్నాం’ అని యుఎస్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రాయిటర్స్‌తో చెప్పారు. యుఎస్ విదేశాంగ శాఖ వ్యాఖ్యపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులోఅరెస్టు నుంచి రక్షణ కల్పించాలన్న కేజ్రీవాల్ అభ్యర్థనను ఢిల్లీలోని ఒక కోర్టు నిరాకరించిన తరువాత నాటకీయ పరిణామాల మధ్య క్రితం ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కస్టడీలోకి తీసుకున్న విషయం విదితమే. కేజ్రీవాల్‌ను గురువారం (28) వరకు ఇడి కస్టడీకి రిమాండ్ చేయడమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News