Monday, December 23, 2024

ఆప్‌లో మరో ‘క్రేజీ’వాల్ ఏరి?

- Advertisement -
- Advertisement -

ఆమ్‌ఆద్మీ పార్టీ చిక్కుల్లో పడింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో సీనియర్ నాయకులు ఒక్కొక్కరు జైలుకు వెళ్లడం.. మరో పక్క లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో పార్టీ నాయకత్వ లోపాన్ని ఎదుర్కొంటోంది. పార్టీకి చెందిన కీలక నాయకులు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, ప్రస్తుతం ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌లు జైల్లో ఉన్నారు. మరి పార్టీని ముందుండి నడిపించేది ఎవరు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే కేజ్రీవాల్ వారసురాలిగా ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషిని తీర్చిదిద్దారన్న టాక్ వినిపిస్తోంది. ఆయన లేని సమయం లో ఢిల్లీ ప్రభుత్వం బాధ్యతలు ఆమె చూసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇక అసలు సవాలు విషయానికి వస్తే రాజకీయ నిర్ణయాలు ఎవరూ తీసుకుంటారు. పార్టీని ముందుండి నడిపించేది ఎవరూ అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమ్‌ఆద్మీ పార్టీని ముందుండి నడిపించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం పార్టీ సీనియర్ నాయకులు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్, కుమార్ విశ్వాస్ లాంటి వారు లేరు.

దీంతో పార్టీలో కీలక నిర్ణయాలు ఎవరూ తీసుకోవాలో అర్ధం కాని పరిస్థితి. ఆమ్‌ఆద్మీ పార్టీని 26 నవంబర్ 2012లో అధికారికంగా ప్రారంభించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి పార్టీలో కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలు చాలా చురుకుగా పని చేస్తూ వచ్చారు. బహిరంగసభలో కేజ్రీవాల్ పార్టీ పేరున ప్రకటించారు. దీర్ఘకాలంగా కేజ్రీవాల్ వెంటే ఉన్న సిసోడియాను ఢిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేజ్రీవాల్ డిప్యూటీ సీఎంగా నియమించారు. ప్రస్తుతం సంజయ్ సింగ్ రాజ్యసభ ఎంపిగా రెండో టర్మ్ కొనసాగుతున్నారు. రాజ్యసభలో సింగ్ ఆప్ పార్టీ తరపున తన గొంతును బలంగా వినిపిస్తున్నారు.అదే కాకుండా పార్టీ వ్యవస్థాపకుల్లో సింగ్ కూడా ఒకరు. ఇక సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌కు చెందినవారు. ఆయనకు వివిధ పార్టీలతో మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలతో ఆప్ సంబంధాలు మరింత బలపడేందుకు కృషి చేశారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం రాత్రి కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. దీంతో సహజంగానే ఇక పార్టీకి ఎవరు నాయకత్వం వహిస్తారు అనే ప్రశ్న తెరపైకి వస్తుంది. ఇదే ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మనీష్ సిసోడియా సుమారు ఏడాది కాలం నుంచి ఆయన జైల్లో ఉన్నారు. ఇదే కేసుకు సంబంధించి రాజ్యసభ ఎంసి సంజయ్ సింగ్‌ను ఇడి అక్టోబర్ 2023లో అరెస్టు చేసి జైలుకు పంపించింది. ఇక పార్టీలో ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ కానీ ప్రస్తుతం ఆప్ పార్టీలో లేరు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని చెప్పి వారిని పార్టీ నుంచి బహిష్కరించారు. ప్రస్తుతం కుమార్ విశ్వాస్‌ను తీసుకుంటే కేజ్రీవాల్‌ను ఆయన తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రస్తుతం పార్టీలో సీనియర్లు లేనందు వల్ల కేజ్రీవాల్ గైర్హాహాజరీలో పార్టీని ముందుండి నడపించేదెవరు అనే ప్రశ్నతలెత్తుతోంది. ఇక సిసోడియా విషయానికి వస్తే ఆయన అరెస్టు అయిన రెండు రోజుల తర్వాత డిప్యూటీ సిఎం పదవికి రాజీనామా చేశారు.

ఎందుకంటే సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఆప్‌పార్టీకి చెందిన మరో మంత్రి సత్యేంద్ర జైన్‌ను తీసుకుంటే ఆయనను వేరే కేసు మనీలాండరింగ్ కేసులో మే 2022లో అరెస్టు చేయడంతో ఆయన అదే రోజు రాజీనామా చేశారు. ఇక గోపాల్ రాయ్ విషయానికి వస్తే ఆయన ఆప్‌పార్టీ ఢిల్లీ చీఫ్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తే కేజ్రీవాల్ తన వారసురాలిగా అతిషీని తీర్చిదిద్దారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే అతిషికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న టాక్‌వినిపిస్తోంది. గురువారం రాత్రి కేజ్రీవాల్ అరెస్టు తర్వాత అతిషి, భరద్వాజలు ఇడి అరెస్టుకు నిరసనగా పెద్ద ఎత్తు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఆప్ నాయకులు మాత్రం కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని చెబుతున్నారు. ఫైల్స్‌ను జైలుకే తీసుకువెళ్తామంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారా లేదా అనేది పక్కనపెడితే.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కీలక నిర్ణయాలు ఎవరూ తీసుకోవాలనేది అసలు ప్రశ్న.

ఇప్పటి వరకు ఆప్ పార్టీలో వన్‌మెన్ షో నడిచింది. గత కొన్ని సంవత్సరాల నుంచి పార్టీలో అరవింద్ కేజ్రీవాల్ మాటే చెల్లుబాటు అయింది. పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి తొమ్మిది మంది సభ్యులతో రాజకీయ వ్యవహారాల కమిటీ పిఎసి ఉంది. తొమ్మిది మందిలో సిసోడియా, సింగ్‌లు జైల్లో ఉన్నారు. ప్రస్తుతం కేజ్రీవాల్ ఇడి కస్టడీలో ఉన్నారు. మిగిలిన వారు అతిషి, రాఘవ్‌చద్దా, దుర్గేష్ పాఠక్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్, రాఖి బిర్లా, పంకజ్ గుప్తా, ఎన్‌డీ గుప్తాలు మాత్రం ప్రస్తుతం పిఎసిలో సభ్యులుగా ఉన్నారు. ఆప్ నేషనల్ సెక్రటరీ సందీప్ పాథక్ విషయానికి వస్తే ఆయన పార్టీని ఇతర రాష్ట్రాల్లో ఎలా విస్తరించాలో వ్యూహ రచన చేస్తుంటారు. మొత్తానికి చూస్తే ఆప్ పార్టీలో నాయకులు ఉన్నా వారికి ఇచ్చిన బాధ్యతలు నేరవేర్చడంలో బిజీబిజీగా ఉన్నారు. అయితే పార్టీని కేజ్రీవాల్ మాదిరిగా ముందుండి నడిపించే నాయకుడు లేకుండా పోయారు.

అయితే పార్టీ నాయకులు మాత్రం ఇప్పటి నుంచే కలవరపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అందరం సమిష్టిగా కలిసి పార్టీని నడుపుతామని చెబుతున్నారు. తమ నాయకుడు జైల్లో ఉన్నా ఆయన మాతోనే ఉంటారు. ఆయనే పార్టీని నడుపుతారు అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఢిల్లీ మంత్రి ఒకరు చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని ఎవరూ ముందుండి నడిపిస్తారో వేచి చూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News