న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీపార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పది రోజుల పాటు విపశ్యన ధ్యానానికి వెళ్లనున్నారని అధికారులు తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిసిన వెంటనే డిసెంబర్ 19 నుంచి పదిరోజుల పాటు ధ్యానానికి వెళ్లనున్నారు. విపశ్యన అనేది పురాతన భారతీయ ధ్యాన పద్ధతి. దీనిలో అభ్యాసకులు వారి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోడానికి కోర్సు పూర్తయ్యేవరకు పదిరోజుల పాటు సంభాషణకు దూరంగా ఉంటారు. అలాగే అభ్యాసన కేంద్రం నుంచి బయటకు రావడం ఉండదు. బయటివ్యక్తులకు ఇందులో ప్రవేశం ఉండదు. కేజ్రీవాల్ చాలా కాలంగా విపశ్యన ధ్యాన సాధన చేస్తున్నారు. ఈ ధ్యాన విధానాన్ని అభ్యసించడానికి గతంలో బెంగళూరు, జైపూర్‌తోసహా అనేక ప్రాంతాలకు వెళ్లారు. కేజ్రీవాల్ ప్రతి ఏడాది విపశ్యన ధ్యానం కోర్సుకు వెళ్తుంటారు. ఈ ఏడాది కూడా డిసెంబర్ 19 నుంచి 30 వరకు ధ్యానంలో ఉంటారు.