Monday, December 23, 2024

సమాజం ఎటు పోతోంది?

- Advertisement -
- Advertisement -

‘అరుదైన నేరాల్లోనే అరుదైన అమానుష నేరమిది, సమాజం ఎటు పోతోందో తెలియడం లేదు’ ఢిల్లీలో ఇటీవల తెల్లవారు జామున ఒక అమ్మాయి ప్రయాణం చేస్తున్న స్కూటర్‌ను ఢీ కొట్టి ఆమెను 12 కి.మీ దూరం ఈడ్చుకుపోయిన కారు ఉదంతంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్య ఇది. అవును, ప్రియురాలితో విభేదించి ఆమెను చంపి మృత దేహాన్ని 36 ముక్కలుగా నరికి దేశ రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో విసిరిన పరమ పైశాచిక ప్రియుడి దారుణోదంతం ఇటీవలే జరిగింది. అటువంటి ఘాతుక నేరాలకు ముఖ్యంగా మహిళలపై చెప్పనలవికాని హింసోన్మాదానికి పేరెన్నికగన్న ఢిల్లీ నగరంలో ఇటువంటివి జరగడం విశేషం కాదని అనుకోవలసి వుంది. ముందు ముందు ఇంకెటువంటి నమ్మశక్యం కాని నేరాలు మహిళలపై అక్కడ చోటు చేసుకుంటాయో అప్పటికైనా అక్కడి సమాజం, పాలకులు మేలుకొని స్త్రీలకు రక్షణ కల్పించగలుగుతారో లేదో చెప్పలేము.

కారు ఢీ కొట్టి మహిళను ఈడ్చుకుపోయిన ఉదంతం ఈ నూతన సంవత్సరం మొదటి రోజు నిద్రలేస్తున్నదనగానే ఢిల్లీలోని కంజవాలా రోడ్డులో జరిగింది. ఐదుగురు వ్యక్తులున్న కారు 20 ఏళ్ళ మహిళ ప్రయాణం చేస్తున్న స్కూటర్‌ను ఢీ కొని ఈ ఘాతుకానికి పాల్పడింది. ఆ కారులో వున్న దీపక్ ఖన్నా (26), అమిత్ ఖన్నా (25), కిషన్ ఖన్నా (27), మిథున్ (26), మనోజ్ మిట్టల్ అనే ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ దారుణ ఘటన జరిగిన సమయంలో వీరు మితిమించి తాగి ఊగుతూ కారులో వెళుతున్నారని బయట పడింది. పెద్ద శబ్దంతో సంగీతం పెట్టుకొని కారు నడుపుతున్నట్టు వెల్లడైంది. కారు కింద చిక్కుకుపోయిన ఆమె అరుస్తున్నా పట్టించుకోకుండా వారు కారు నడిపినట్టు, పోలీసు బారికేడ్లు అడ్డమొచ్చిన చోట ‘యు’ టర్న్‌లు తిప్పుకొంటూ విలాసంగా సాగిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. రాత్రి పూట పెళ్ళిళ్ళు, ఇతర ఉత్సవాలు జరిగే చోట సేవలందిస్తూ బతుకుతున్న ఆ మహిళ ఆ రోజు ఇంటికి తిరిగి వెళుతూ ఈ ముష్కరుల క్రూర వాహన విన్యాసానికి బలైనట్టు తెలుస్తున్నది. ఈ సంఘటనను చూసిన వారు పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినా వారు దానిని పట్టించుకోలేదని వెల్లడైంది.

తెల్లవారు జామున 3.20 గం. కు జరిగిన ఈ సంఘటనను ఒక దుకాణం బయట నిలుచున్న వ్యక్తి చూసి కంట్రోల్ రూమ్‌కి ఫిర్యాదు చేశాట్ట. అప్పటికి ఆ కారు అక్కడికి 100 మీ. దూరంలో వుందట. కొత్త సంవత్సరం ఉదయిస్తున్న రోజు రాత్రి 16,500 మంది పోలీసులు రోడ్లపై పహరా కాస్తున్న ఢిల్లీ నగరంలో ఇటువంటి ఘాతుకం జరిగిందంటే అంత మంది రక్షక సైన్యం మేలుకొని వుందా, నిద్రపోతూ కాపలా కాస్తున్నదా? ఆ సమయంలో నిందితుల్లోని దీపక్ ఖన్నా అనే వ్యక్తి కారు నడుపుతున్నట్టు వెల్లడైంది. అతడు స్థానిక నాయకుడట. దీపక్ ఖన్నా గ్రామీణ సేవ అనే సంస్థలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడట. మనోజ్ మిట్టల్ అనే నిందితుడు దేశాన్ని పరిపాలిస్తున్న, ఢిల్లీలో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్న, ఖ్యాతి గడించిన, ఘనత వహించిన భారతీయ జనతా పార్టీ సభ్యుడట. ఆ విషయాన్ని ఒక సీనియర్ బిజెపి నాయకుడే ధ్రువపరిచాడు.

కొత్త సంవత్సరం వేడుకలు హద్దులు మీరి సమాజానికి హానికరంగా పరిణమించకుండా తగిన ఆంక్షలు విధించడం, మద్యం సేవించేవారిపై గట్టి నిఘా వుంచడం సాధారణంగా అన్ని నగరాల్లోని పోలీసులు చేస్తుంటారు. మరి దేశ రాజధానిలో సాక్షాత్తు రాష్ట్రపతి, ప్రధాని కొలువుండే మహా నగరంలో ఈ జాగ్రత్తలు అవసరమైన స్థాయిలో తీసుకోలేదని ఈ దారుణోదంతం చాటుతున్నది. అలాగే పాలక పార్టీ సభ్యులు, సన్నిహితులు తామేమి చేసినా అడిగే వారుండరనే దుర్మార్గపు ధీమాతో వ్యవహరిస్తుంటారని, వారిని పోలీసులు ఏమీ అనలేకపోతున్నారని తెలుస్తున్నది. అన్నింటికీ మించి మహిళను అత్యంత చులకనగా కేవలం భోగ వస్తువుగా పరిగణించి ఆమెను ఇష్టావిలాసంగా హింసించి ఆనందించే తత్వం దేశ రాజధాని పురుషుల్లో జీర్ణించుకొని పోయిందా అనే అనుమానానికి ఆస్కారం కలుగుతున్నది.

ఢిల్లీలో 2021లో ప్రతి రోజూ ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం జరిగినట్టు జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) నివేదిక వెల్లడించింది. దేశం మొత్తం మీదనే ఢిల్లీ మహిళలకు చాలా అరక్షిత ప్రదేశమని మరోసారి వ్యాఖ్యానించింది. 2021లో మహిళలపై నేరాలు 40 శాతం పెరిగాయి. ఆ సంవత్సరంలో ఇందుకు సంబంధించి 13,892 కేసులు నమోదయ్యాయి. మహిళను అత్యంత గౌరవంగా చూస్తామని చెప్పుకొనే దేశాధినేతలకు ఈ విషయాలు తెలియవా? వాస్తవంలో మన దేశం అత్యంత మహిళా వ్యతిరేకి అని ప్రపంచానికి ఇటువంటి దురాగతాలు చాటడం లేదా? ఇంతటి ఆధునిక యుగంలోనూ ఆమెను వంటింటి నుంచి, పడకటింటి నుంచి కాళు బయట పెట్టనీయకుండా వుంచుదామా?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News