ప్రధాని మోడీని ప్రశ్నించిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరీ జిల్లాలో హింసాకాండ సందర్భంగా రైతులు మరణించడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. బుధవారం వర్చువల్ పద్ధతిలో కేజ్రీవాల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లఖీంపూర్ ఖేరీ సంఘటనలో ప్రధాన నిందితుడైన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడిని వెంటనే అరెస్టు చేసి మిశ్రాను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. గడచిన ఏడాది కాలంగా రైతులు ఆందోళన సాగిస్తున్నారని, ఇప్పటి వరకు 600 మందికి పైగా రైతులు చనిపోయారని ఆయన తెలిపారు. ఇప్పుడు రైతులను వాహనాల చక్రాలతో తొక్కించి చంపుతున్నారని, రైతులపై ఎందుకింత విద్వేషమంటూ ఆయన ప్రధాని మోడీని ప్రశ్నించారు. రైతులకు న్యాయం చేయాలని దేశంలోని ప్రతి పౌరుడు డిమాండ్ చేస్తున్నాడని, ఇక నిర్ణయం మీ చేతుల్లోనే ఉందంటూ ఆయన ప్రధానికి విజ్ఞప్తి చేశారు.