Sunday, December 22, 2024

కేంద్రం జోక్యం కోరిన కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గత రెండు రోజులుగా ఢిల్లీలో వర్షాలు పడక పోయినప్పటికీ యమునా నది జలాలు అసాధారణ స్థాయిలో పెరుగుతున్నాయని, హర్యానా లోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేయడమే దీనికి కారణమని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేర్కొన్నారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని యమునా నీటిస్థాయిలు పెరగకుండా జోక్యం చేసుకోవాలని కోరారు.

ఈమేరకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. కేంద్ర జలసంఘం అంచనా వేస్తున్నట్టు 207.72 మీటర్లకు నీటిమట్టం స్థాయి పెరిగితే ఢిల్లీకి మంచిది కాదన్నారు. కొన్ని వారాల్లో ఢిల్లీలో జి 20 సదస్సు జరగనున్నట్టు గుర్తు చేశారు. యమునా నది నీటి మట్టం స్థాయిలు మున్ముందు పెరగకుండా చూడాలని ట్విటర్‌లో విజ్ఞప్తి చేశారు. 1978 లో యమునా నది నీటి మట్టం 207.49 మీటర్లకు చేరడంతో ఢిల్లీలో భీకర వరదలు సంభవించాయి. ఇప్పుడు ఆ రికార్డును కూడా దాటడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఇప్పటికే తీర ప్రాంతం లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించారు. మరోవైపు ప్రజలు నివసిస్తున్న కొన్ని కాలనీల్లోకి వరద నీరు ముంచెత్తింది. మార్కెట్ల లోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. వరద ముప్పును ఎదుర్కోడానికి సంసిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు వరదలు సంభవించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు ముందు జాగ్రత్తగా 144 సెక్షన్ విధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News