థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనే ఏర్పాట్లపై చర్చ
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఆ రాష్ట్ర గవర్నర్ అనిల్‌బైజల్‌తో చర్చించారు. థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు రోడ్‌మ్యాప్‌పై వారి మధ్య చర్చ జరిగినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం(సిఎంఒ) తెలిపింది. అందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్టు సిఎంఒ పేర్కొన్నది. గవర్నర్‌తో చర్చలో ప్రభుత్వ సంసిద్ధతపై సిఎం వివరించారని తెలిపింది. కొవిడ్19 చికిత్సకు అందుబాటులో ఉన్న పడకలు, ఆక్సిజన్, ఔషధాలు, వ్యాక్సినేషన్‌లాంటి అంశాలు ప్రస్తావనకొచ్చాయని తెలిపింది. డాక్టర్లు, నర్సులకు సహాయపడేలా 5000మంది యువకులకు శిక్షణ ఇప్పించనున్నట్టు తెలిపింది.
ఒక్కో బ్యాచ్‌లో 500 మంది చొప్పున పాల్గొనే శిక్షణా కార్యక్రమం జూన్ 28 నుంచి ప్రారంభమవుతుంది. రెండు వారాలపాటు శిక్షణ ఉంటుంది. థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనే కార్యాచరణ ప్రణాళిక కోసం ఢిల్లీ ప్రభుత్వం మే నెలలోనే 13మంది నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఆస్పత్రుల్లో చికిత్స నిర్వహణపై పర్యవేక్షణకు 8మందితో మరో నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. థర్డ్ వేవ్‌లో చిన్నారులకు సమస్యలు ఎదురైతే ఎలా ఎదుర్కోవాలో సలహాలిచ్చేందుకు పీడియాట్రిక్ టాస్క్ ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేసింది. థర్డ్‌వేవ్‌లో అత్యధికంగా 37,000 వరకు రోజువారీ కేసులు వెళ్తాయన్న అంచనా ఉన్నందున, ఆమేరకు ఆస్పత్రుల్లో వసతుల్ని తమ ప్రభుత్వం సిద్ధం చేసిందని కేజ్రీవాల్ తెలిపారు.