Monday, December 23, 2024

నిందితులకు సాయపడిన చర్మకారుడి కోసం గాలింపు

- Advertisement -
- Advertisement -

యుపి పోలీసుల సాయం కోరిన ఢిల్లీ పోలీసులు
పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసులో దర్యాప్తు ముమ్మరం

న్యూఢిల్లీ: పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసులో నిందితులైన సాగర్ శర్మ, మనోరంజన్ డి తమ షూస్‌లో స్మోక్ బాంబులను దాచేందుకు వారి షూస్‌లో రంధ్రాలు చేసి అరను ఏర్పాటు చేసిన సైకిల్‌పై తిరిగే చర్మకారుడి ఆచూకీని కనిపెట్టడంలో తమకు సాయపడవలసిందిగా ఉత్తర్ ప్రదేశ్ పోలీసులను ఢిల్లీ పోలీసులు కోరారు. ఈ కేసులో ఆ చర్మకారుడిని సాక్షిగా ప్రవేశపెట్టాలని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. మొదట షూస్‌లో రంద్రాలు వేయడానికి నిందితుడు సాగర్ ప్రయత్నించాడని, అయితే అది తనకు సాధ్యం కాకపోవడంతో లక్నోలోని ఆలంబాగ్‌లో సైకిల్‌పై తిరిగే ఒక చర్మకారుడిని కలుసుకున్నాడని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి.

ఆ చర్మకారుడి ఆచూకీని కనిపెట్టేందుకు ఢిల్లీ పోలీసులు ఈ నెల మొదట్లో లక్నో వెళ్లాయి. అయితే ఆ వ్యక్తి ఆచూకీ కనిపెట్టడం పోలీసులకు సాధ్యం కాలేదు. దీంతో ఉత్తర్ ప్రదేశ్ పోలీసుల సాయాన్ని కోరినట్లు వర్గాలు తెలిపాయి. 2001లో పార్లమెంట్‌పై దాడి జరిగిన రోజే డిసెంబర్ 13న పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. విజిటర్స్ గ్యాలరీ ద్వారా పార్లమెంట్‌లోకి ప్రవేశించిన సాగర్, మనోరంజన్ జీరో అవర్‌లో లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకి స్మోక్ బాంబులను ప్రయోగించారు. వారిని ఎంపీలు పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. మైసూరుకు చెందిన బిజెపి లోక్‌సభ సభ్యుడు ప్రతాప్ సిన్హా మంజూరు చేసిన పాసుల ద్వారా వారు విజిటర్స్ గ్యాలరీలోకి ప్రవేశించినట్లు దర్యాప్తులో తేలింది. పార్లమెంట్‌లోకి ప్రవేశించే సమయంలో భద్రతా తనిఖీ వద్ద షూస్‌ను తనిఖీ చేయడం లేదని గమనించి తన షూస్‌లోపల రంధ్రం చేయడానికి ప్రయత్నించినట్లు సాగర్ పోలీసుల దర్యాప్తులో వెల్లడించాడు.

తన ప్రయత్నం సఫలీకృతం కాకపోవడంతో ఆలంబాగ్‌లోని చర్మకారుడి వద్దకు అతను వెళ్లాడు. తన ఇంటి సమీపంలోని ఒక దుకాణం నుంచి రూ. 595 చొప్పున రెండు షూస్ కొనుగోలు చేసినట్లు సాగర్ వెల్లడించాడు. ఆ తర్వాత సైకిల్‌పై ఆలంబాగ్ వచ్చిన చర్మకారుడిని కలుసుకున్నాడని వర్గాలు తెలిపాయి. ఆ చర్మకారుడు ఎడమ షూ లోపలి భాగంలో రంధ్రం చేసి చిన్న అరలా తయారుచేశాడని, దానిపైన దలసరి సోల్ అతికించాడని, కుడి షూను కూడా కొద్దిగా కట్ చేసి ఉందని ఎఫ్‌ఐఆర్‌లో ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. ఈ నెల మొదవట్లో ఢిల్లీ పోలీసులకు చెందిన ప్రత్యేక విభాగం బృందం లక్నోను సందర్శించి ఆ చర్మకారుడి కోసం గాలించింది. ఆలంబాగ్‌లో పలువురు చర్మకారులను ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆలంబాగ్‌లోని రాంనగర్‌లో ఉన్న సాగర్ ఇంటికి కూడా వెళ్లిన పోలీసు బృందం అక్డడ ఒక జత షూస్, షూలోపలి సోల్, షూస్ సైజును కొలిచే స్కేలును స్వాధీనం చేసుకున్నట్లు వర్గాలు తెలిపాయి.

సాగర్ స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్‌ను అభిమానిస్తాడని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. భగత్ సింగ్‌తోఆటు, క్యూబాకు చెందిన మార్కిస్టు విప్లవ నాయకుడు చెగువేరాకు సంబంధించిన వ్యాసాలను సాగర్ తన ఫేస్‌బుక్‌లో షేర్ చేసేవాడని వర్గాలు తెలిపాయి. 12వ తరగతి పాసైన సాగర్ లక్నోలో ఇ రిక్షా డ్రైవర్‌గా పనిచేశాడు. అతని తండ్రి రోషన్ లాల్ వడ్రంగి. తల్లి గృహిణి. సాగర్ కుటుంబ సభ్యులతోపాటు అతని స్నేహితులు, సాగర్‌కు షూస్ అమ్మిన దుకాణం యజమాని వాంగ్మూలాలను కూడా పోలీసులు నమోదు చేశారు. ఇదే కేసుకు సంబంధించి సాగర్, మనోరంజన్‌తోపాటు మరో నలుగురు వ్యక్తులు నీలం, అమోల్ షిండే, లలిత్ ఝా, మహేష్ కుమావత్‌ను ఢిల్లీ పోలీసులు ఇదివరకే అరెస్టు చేశారు. వీరిపై అ్యంత కఠినమైన యుఎపిఎ కింద కేసు పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News