శాంతిభద్రతల విషయంలో కోర్టు జోక్యం చేసుకోదు
రైతుల ట్రాక్టర్ ర్యాలీకి అనుమతిపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోకి ఎవరిని ఎప్పుడు అనుమతించాలనేది పూర్తిగా స్థానిక పోలీసుల అధికార పరిధిలోని అంశమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రైతుల ట్రాక్టర్ ర్యాలీకి అనుమతి ఇవ్వాలా వద్దా అనేది పోలీసులే నిర్ణయించాలని సూచించింది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం నాడు రైతులు నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ జరపకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన వ్యాజ్యంపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఢిల్లీ పోలీసుల ద్వారా కేంద్రం ఈ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఎ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఇది పూర్తిగా శాంతిభద్రతలకు సంబంధించిన అంశమని స్పష్టం చేసింది. పోలీసులు ఏం చేయాలో కోర్టు చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది.
తదుపరి విచారణను ఈ నెల 20కి (బుధవారానికి) వాయిదా వేసింది. వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఈ నెల 26న ట్రాక్టర్ల ర్యాలీ జరుపుతామని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నాయకులు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలాచేస్తే గణతంత్ర వేడుకలకు ఆటంకం కలుగుతుందని, అందువల్ల దీన్ని నిలుపుదల చేయాలని కేంద్రం తరఫున ఢిల్లీ పోలీసులు సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ బోబ్డే, జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, జస్టిస్ వినీత్ శరణ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. తాము వ్యవసాయ చట్టాలకు సంబంధించిన అంశాన్ని పరిశీలిస్తున్నామని, పోలీసు అధికారాలపై తామేమీ చెప్పబోమని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన విచారణలో బెంచ్ అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్‌కు తెలిపింది. మరో వైపు రైతుల ఆందోళన వ్యవహారంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ మంగళవారం సమావేశం కానుంది.