Monday, January 20, 2025

నేను బాధితురాలిని.. కవిత 4 పేజీల లేఖ

- Advertisement -
- Advertisement -

లిక్కర్ స్కామ్‌తో నాకెలాంటి సంబంధం లేదు, ఆర్థికంగా ఏ లబ్ధి చేకూరలేదు 
నా ప్రతిష్ఠ దెబ్బతీశారు, ఇతరుల స్టేట్‌మెంట్‌తో నన్ను అరెస్టు చేశారు
నాలుగు సార్లు విచారణకు హాజరయ్యాను,
ఫోన్లు ధ్వంసం చేశానని, సాక్షులను బెదిరిస్తున్నానని నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు: కవిత  
23వరకు జ్యుడిషీయల్ రిమాండ్ పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు

మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను బాధితురాలిని అని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత అన్నారు. లిక్కర్ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఆ మెకు రౌస్ అవెన్యూ కోర్టు విధించిన 14 రోజుల కస్టడీ మంగళవారంతో ముగియగా ఇడి అధికారులు మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో కవిత కోర్టులో మాట్లాడేందుకు న్యాయమూర్తి అంగీకరించక పోవడంతో ఆమె 4 పేజీల లేఖను విడుదల చేశారు. ’ఢిల్లీ లిక్కర్ కేసులో నేను బాధితురాలిని. ఈ స్కాంతో నాకు ఎలాంటి సం బంధం లేదు. దర్యాప్తు సంస్థలు పేర్కొన్నట్లు నాకు ఆర్థికంగా ఏ లబ్ధీ చేకూరలేదు. రెండేళ్ల నుంచీ కేసు విచారణ ఎటూ తేలడం లేదు. వేరే వ్యక్తుల స్టేట్‌మెంట్ తో నన్ను అరెస్ట్ చేశారు. సిబిఐ, ఇడి దర్యాప్తు కంటే మీడియా లో విచారణ ఎక్కువగా సాగింది. రాజకీయంగా, వ్యక్తిగతంగా నా ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారు. నా ఫోన్ నెంబర్ ను ఛానళ్లలో ప్రసారం చేసి నా ప్రైవసీని దెబ్బతీశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నాలుగు సార్లు విచారణకు హాజరయ్యాను.

బ్యాంకు వివరాలు కూడా ఇచ్చి అన్ని విధాలుగా విచారణకు సహకరించాను. నా మొబైల్ ఫోన్లన్నీ దర్యాప్తు సంస్థకు అందజే శాను. ఫోన్లు ధ్వంసం చేశానని నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. రెండున్నరేళ్లుగా సోదాలు జరిపారు. సాక్షులను బెదిరిస్తున్నట్లు నాపై ఆరోపణలు చేస్తున్నారు. మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు. 95 శాతం కేసులన్నీ ప్రతిపక్ష నేతలకు సంబం ధించినవే. బిజెపిలో చేరిన వెంటనే ఆ కేసుల విచారణ ఆగిపోతుంది. విపక్ష పార్టీలన్నీ న్యాయ వ్యవస్థపై ఆశతో చూస్తున్నాయి. కేసు దర్యాప్తునకు సహకరించేందుకు పూర్తి సిద్ధంగా ఉన్నా. ఈ పరిస్థితుల్లో నాకు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థిస్తున్నాను. నా చిన్న కుమారుడు పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో తల్లిగా నేను తనతో ఉండాలి. నా పాత్రను ఎవరూ భర్తీ చేయలేరు. ఈ క్రమంలో నా కుమారుడిపై ప్రతికూల ప్రభా వం పడుతుందని ఆందోళన చెందుతున్నాను. నా బెయిల్ అభ్యర్థనను పరిశీలించాల్సిందిగా మళ్లీ కోరుతున్నాను.’ అని కవిత లేఖలో పేర్కొన్నారు.

జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఎంఎల్‌సి కవితకు రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 23 వరకూ జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించింది. మంగళవారంతో కవిత 14 రోజుల కస్టడీ ముగియగా ఇడి అధికారులు ఆమెను న్యాయమూర్తి జస్టిస్ కావేరీ బవేజా ముందు హాజరు పరిచారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీ లాండరింగ్ కు సంబంధించి కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఆమె బయట ఉంటే దర్యాప్తు ప్రభావితం అవుతుందని ఇడి వాదనలు వినిపించింది. మరో 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని కోర్టును కోరింది. అయితే, కవిత కస్టడీ పొడిగించడానికి ఇడి వద్ద కొత్తగా ఏమీ లేవని ఆమె తరఫు న్యాయవాది రానా కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కవితకు కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమెను ఇడి అధికారులు తీహార్ జైలుకు తరలించారు. మరోవైపు, కవితను మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కవిత తరఫు న్యాయవాది కోర్టును కోరగా ఆమె నేరుగా మాట్లాడేందుకు న్యాయమూర్తి నిరాకరించారు. కోర్టు హాలులో భర్త, మామను కలిసేందుకు జడ్జి అనుమతి ఇవ్వ డంతో వారు కవితను కలిశారు.

వరుస షాక్‌లు..!
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎంఎల్‌సి కవితకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని, ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం విచారించిన రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ పిటిషన్‌ను కొట్టేసింది. చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున ఈ నెల 16 వరకూ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఏప్రిల్ 4న తీర్పును రిజర్వ్ చేసింది. సోమవారం బెయిల్ పిటిషన్ కొట్టేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. మరోవైపు, కవిత సాధారణ బెయిల్ పిటిషన్ పై మాత్రం ఈ నెల 20న ఇరు వర్గాల వాదనలు వింటామని న్యాయస్థానం ఇదివరకే వెల్లడించింది. కాగా, కవితను మార్చి 15న హైదరాబాద్ లో ఇడి అరెస్ట్ చేయగా 16న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. తొలిసారి 2 రోజులు, రెండోసారి 3 రోజులు కోర్టు అనుమతితో మొత్తం 10 రోజులు ఆమెను కస్టడీలోకి తీసుకున్న ఇడి విచారించింది. న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించడంతో మార్చి 26న కవితను తీహార్ జైలుకు తరలించారు. మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 4న విచారణ జరగ్గా తీర్పు రిజర్వ్ చేసిన అనంతరం తాజాగా తీర్పు వెలువ రించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News