Wednesday, January 1, 2025

ఎంపి సంజయ్ సింగ్‌కు అక్టోబర్ 10 వరకు ఈడీ కస్టడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను కోర్టు ఐదు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. గురువారం మధ్యాహ్నం సంజయ్‌ను కోర్టులో హాజరు పరచగా, ఇరు వర్గాల వాదనలు విన్న తరువాత రౌస్ అవెన్యూ కోర్టు ఆయన్ను ఈ నెల 10 వరకు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తొలుత ఈడీ అధికారులు సంజయ్ సింగ్‌ను పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ వాదనలు వినిపించారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన వ్యాపారవేత్త దినేశ్ అరోడా సంజయ్‌కు డబ్బులు ఇచ్చినట్టు రికార్డు చేసిన వాంగ్మూలాన్ని కోర్టుకు సమర్పించారు.

దీనికి సంబంధించిన డిజిటల్ ఆధారాన్ని సైతం స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరోవైపు ఈడీ అధికారులు సంజయ్ సింగ్‌ను అవమానించేందుకే అరెస్ట్ చేశారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈడీ అరెస్ట్ చేసిన దినేశ్ అరోడా అప్రూవర్‌గా మారారని, ఈ కేసులో ముందుగా ఎప్పుడూ సమన్లు కూడా ఇవ్వలేదని వాదించారు. అనంతరం ఈడీ కస్టడీకి తరలిస్తున్న సమయంలో సంజయ్ సింగ్ అక్కడే ఉన్న పలువురు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తనపై చేసినవన్నీ నిరాధార , తప్పుడు ఆరోపణలేనన్నారు. ఇలాంటి వాటికి భయపడబోమని , పోరాటం చేస్తామని చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News