న్యూఢిల్లీ: ఒక హిందూ దేవతపై 2018లో పోస్టు చేసిన అభ్యంతరకర ట్వీట్‌కు సంబంధించిన కేసులో అరెస్టయి జైలులో ఉన్న ఆల్ట్ న్యూస్ సహవ్యవస్థాపకుడు మొహమ్మద్ జుబేర్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌తోపాటు జుబేర్‌కు 14 రోజుల జుడిషియల్ కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన మరో పిటిషన్‌పై ఢిల్లీ కోర్టు శనివారం తన ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. అంతకుముందు.. ఐదురోజుల కస్టోడియల్ విచారణ పూర్తికావడంతో శనివారం ఉదయం ఢిల్లీ పోలీసులు జుబేర్‌ను చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ స్నిగ్ధ సర్వరియా ఎదుట హాజరుపరిచారు. ఇక తమకు కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరం లేదని, ఆయనను జుడిషియల్ కస్టడీకి అప్పగించాలని పోలీసులు మెజిస్ట్రేట్‌ను కోరారు. కాగా, జుబేర్ తరఫున హాజరైన న్యాయవాది వృంద గ్రోవర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై వాదనలు పూర్తయిన అనంతరం తన తీర్పును మెజిస్ట్రేట్ రిజర్వ్ చేశారు.
Delhi Court reserved bail petition of Alt News Zubair