న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు నమోదైన కేసులో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు, బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ జులై 18న కోర్టులో హాజరుకావాలంటూ ఢిల్లీ కోర్టు శుక్రవారం సమన్లు జారీచేసింది.
బ్రిజ్ భూషణ్‌పై విచారణ కొనసాగించడానికి తగినన్ని ఆధారాలు ఉన్నాయంటూ కోర్టు పేర్కొంది. ఢిలీ పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్(సిఎంఎం) హర్జీత్ సింగ్ జస్పాల్ జులై 18న తమ ఎదుట హాజరుకావాలని బ్రిజ్ భూషణ్‌ను ఆదేశించారు. ఆయనతోపాటు సస్పెన్షన్‌లో ఉన్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్‌కు కూడా కోర్టు సమన్లు జారీచేసింది.
ఆరుసార్లు ఎంపిగా గెలిచిన బ్రిజ్ భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు జూన్ 15న చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఐపిసిలోని వివిధ సెక్షన్ల కింద బ్రిజ్ భూషణ్‌పై అభియోగాలు నమోదయ్యాయి. తోమర్‌పై కూడా వివిధ సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి.