న్యూఢిల్లీ: ఆర్‌జెడి అధినేత లాలూప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో రైల్వేలో ఉద్యోగాలకు అక్రమంగా భూములు తీసుకున్నారన్న ఆరోపణలకు సంబంధించి లాలూప్రసాద్, ఆయన సతీమణి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, ప్రస్తుతం రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ఉన్న తేజస్వి యాదవ్‌లకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో వీరితో పాటుగా ఇతర నిందితులపై దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక జడ్జి గీతాంజలి గోయల్ అవినీతి, క్రిమినల్ కుట్ర, చీటింగ్, ఫోర్జరీ సహా వివిధ నేరాలకు సంబంధించి ప్రాథమికంగా ఆధారాలున్నట్లు సాక్షాలను బట్టి కనిపిస్తోందని పేర్కొన్నారు.
నిందితులను అరెస్టు చేయకుండా చార్జిషీట్ దాఖలు చేయడం జరిగిందని పేర్కొంటూ వీరిని అక్టోబర్ 4న కోర్టు ఎదుట హాజరు కావాలని ఆ సమన్లలో పేర్కొన్నారు. మాజీ రైల్వే మంత్రి అయిన లాలూ ప్రసాద్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి అవసరమైన అనుమతిని సంబంధిత అధికారులు నుంచి పొందినట్లు సిబిఐ ఇటీవల కోర్టుకు తెలిపింది. ఈ కుంభకోణానికి సంబంధించి సిబిఐ గత జులై 3న చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో సిబిఐ దాఖలు చేసిన రెండో చార్జిషీట్ ఇది. అయితే మొదటి చార్జిషీట్‌లో నిందితుల జాబితాలో తేజస్వియాదవ్ పేరు లేదు. ఈ ముగ్గురు కాకుండా చార్జిషీట్‌లో 14 మంది వ్యక్తులు, సంస్థల పేర్లను సిబిఐ పేర్కొంది.