న్యూఢిల్లీ : దేశంలో కరోనా అదుపులోనే ఉన్నప్పటికీ ఢిల్లీలో మరోసారి కరోనా విజృంభిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. హోం ఐసొలేషన్‌లో ఉండే వారి సంఖ్య పెరుగుతోంది. అలాగే పాజిటివిటీ రేటు నాలుగు శాతానికి సమీపించడం ఆందోళన కలిగిస్తోంది. శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం శుక్రవారం దేశంలో 3 లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా, 975 మందికి పాజిటివ్‌గా తేలింది. అందులో ఒక్క ఢిల్లీ నుంచి వచ్చిన కేసులే 366 గా ఉన్నాయి. అక్కడ పాజిటివిటీ రేటు 3.95 శాతానికి చేరింది. ఫిబ్రవరి 3 తర్వాత ఇదే అత్యధికం కావడం గమనార్హం. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 4.30 కోట్ల మందికి కరోనా సోకింది.
24 గంటల వ్యవధిలో 796 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇటీవల రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. దాంతో క్రియాశీల కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం క్రియాశీల కేసులు 11,366 (0.03 శాతం) కు పెరిగాయి. మొత్తం కేసుల్లో రికవరీల వాటా 98.76 శాతంగా ఉంది. శుక్రవారం నలుగురు మృతి చెందారు. ఇప్పటివరకు 5.21 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో దశల వారీగా కరోనా టీకా కార్యక్రమం సజావుగా సాగుతోంది. శుక్రవారం సెలవు రోజు కావడంతో నిర్ధారణ పరీక్షల సంఖ్య, టీకా పంపిణీ తక్కువగానే జరిగింది. నిన్న 6.89 లక్షల మంది టీకా తీసుకోగా, మొత్తం 186 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఢిల్లీ వాసులకు ఉచితంగా ప్రికాషనరీ డోసు ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.