ఢిల్లీ డిక్లరేషన్
న్యూఢిల్లీ: ఏడు దేశాలకు చెందిన భద్రతాధికారులు బుధవారం మధ్యాహ్నం ఆఫ్ఘనిస్థాన్ అంశంపై ఏకగ్రీవ దస్తావేజును విడుదలచేశారు. భారత జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఎ) అజిత్ దోవల్ అధ్యక్షతన జరిగిన ప్రాంతీయ భద్రత చర తర్వాత ఈ డాక్యుమెంట్‌ను విడుదలచేశారు. ఆఫ్ఘనిస్థానంలో తాలిబన్‌ల పాలనపై ఈ సమావేశం ఎలాంటి విమర్శలు చేయలేదు. పైగా ఆఫ్ఘనిస్థాన్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీని కాపాడాలని, బయటి శక్తులు ఆఫ్ఘన్ వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా చూడాలని నొక్కి చెప్పింది. ఇది పరోక్షంగా పాకిస్థాన్‌ను ఆఫ్ఘనిస్థాన్ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దన్న హెచ్చరికను చేసినట్లయింది. అయితే పాకిస్థాన్ కాబుల్‌లో వ్యూహాత్మక చోటుకు ప్రయత్నిస్తోంది.
ఉగ్రవాదులకు ఆశ్రయం, శిక్షణ, ప్రణాళిక లేక ఉగ్రవాదులకు ఆర్థిక సాయం, ఉగ్రవాద కార్యకలాపాలకు ఆఫ్ఘనిస్థాన్ నెలవు కాకుండా చూడాలని ఏడు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు తమ ప్రకటనలో కోరారు. కుందుజ్, కాందహార్, కాబూల్‌లలో జరిగిన ఉగ్రవాద దాడులను సమావేశంలో పాల్గొన్న ఏడు దేశాలకు చెందిన జాతీయ భద్రతా సలహాదారులు ఖండించారు. ఆఫ్ఘనిస్థాన్‌లో ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలైన తలెత్తితే దానిని కఠినంగా అణచివేస్తామని కూడా ప్రకటించారు. శాంతి, భద్రత, సుస్థిరతల విషయంలో ఆఫ్ఘన్ ప్రజలకు సాయపడతామని కూడా ప్రకటించారు.