న్యూఢిల్లీ : అఫ్ఘనిస్థాన్‌లో శాంతిభద్రతల అంశంపై బుధవారం ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది. తాలిబన్ల ఆధీనపు అఘ్ఘనిస్థాన్ నుంచి తలెత్తే శాంతిభద్రతల పరిస్థితిని సంఘటితంగా ఎదుర్కొవాలని పిలుపు వెలువడింది. ప్రస్తుత అఫ్ఘన్ పరిణామాలతో ఉగ్రవాద కార్యకలాపాలు విస్తరించి, శాంతికి విఘాతం తలెత్తే ముప్పు ఉందనే ఆందోళన వ్యక్తం అయింది. అఫ్ఘన్ పరిణామాలపై ఇక్కడ భారత్, రష్యా, ఇరాన్ , ఐదు మధ్య ఆసియా దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, భద్రతా ఉన్నతాధికారుల కీలక భేటీ జరిగింది. పాకిస్థాన్ గైర్హాజరు అయిన ఈ సదస్సును భారతదేశం చొరవ తీసుకుని ఏర్పాటు చేసింది. తాలిబన్ల ప్రాబల్యంతో ఉగ్రవాదానికి ఊతం ఏర్పడుతోంది.
దీనితో ఈ ప్రాంతంలో భద్రతా సవాళ్లు తలెత్తుతాయని, వీటిని కలిసికట్టుగా ఎదుర్కొవల్సి ఉందని జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఎ) అజిత్ ధోవల్ ఈ సమావేశ ప్రారంభోపన్యాసంలో తెలిపారు. అఫ్ఘన్‌పై ఢిల్లీ రీజినల్ సెక్యూరిటీ డైలాగ్ పేరిట ఈ భేటీ జరిగింది. ఈ మధ్యకాలంలో అఫ్ఘనిస్థాన్‌లో పరిణామాలు కేవలం ఆ దేశానికే కాకుండా ఈ ప్రాంతంపై కూడా దుష్ప్రభావం చూపుతాయని ధోవల్ తెలిపారు. ఇక అంతా ఒకే తాటిపైకి వచ్చి సమస్య పరిష్కారం దిశలో తీసుకోవల్సిన చర్యలను బేరీజు వేసుకోవల్సి ఉందన్నారు. ఈ సదస్సుకు రావాలని చైనా, పాకిస్థాన్‌లను కూడా ఆహ్వానించారు. అయితే ఈ రెండు దేశాలు హాజరుకాలేదు. రష్యా ఇరాన్‌తో పాటు మధ్య ఆసియా దేశాలైన కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజికిస్థాన్, టర్కెమెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్‌లు ఈ భేటీకి తమ జాతీయ భద్రతా సలహాదార్లతో ప్రాతినిధ్యం వహించాయి.