కాలేయం నుంచి గుండెలోకి జారిన స్టెంట్‌ను తొలగించిన ఢిల్లీ వైద్యులు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్ హార్ట్ ఇనిస్టిట్యూట్ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. 35 ఏళ్ల ఓ వ్యక్తికి కాలేయంలో అమర్చిన లోహపు స్టెంట్ గుండె కుడిభాగంవైపు జారిపోవడంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడిన స్థితికి చేరుకున్నారు. అలాంటి తీవ్ర సమస్యను తమ శస్త్ర చికిత్స ద్వారా వైద్యులు పరిష్కరించారు. ఈ సర్జరీలో 12మంది వైద్యులతోపాటు పారా మెడికల్ సిబ్బంది భాగస్వాములయ్యారు. బాధితుడికి గతంలో కాలేయంలో సమస్య ఏర్పడటంతో స్టెంట్ వేయించుకున్నారు.
అది గుండె కుడిభాగంలోని కర్ణికలోకి జారిపోయింది. దాంతో,బృహద్ధమని చీలిపోయి గుండె, కాలేయం మధ్య తీవ్ర రక్త స్రావానికి దారితీసింది. చావుబతుకుల స్థితిలో బాధితుడు పలు ఆస్పత్రులను సందర్శించగా, ఇది సంక్లిష్ట సమస్య అంటూ తిప్పి పంపారు. తీవ్రమైన చాతీ నొప్పి, శ్వాస ఆడని స్థితిలో పేషెంట్ తమ దగ్గరికొచ్చాడని ఫోర్టిస్ ఎస్కార్ట్‌లోని గుండె సర్జరీ విభాగం డైరెక్టర్ రిత్విక్‌రాజ్‌భూయాన్ తెలిపారు. సర్జరీ తర్వాత రెండు వారాలకు పేషెంట్ సాధారణస్థితికి చేరుకున్నాడని ఆయన తెలిపారు. మరో మూడు నెలలపాటు తమ పర్యవేక్షణ అవసరమన్నారు. వైద్య చరిత్రలో ఇప్పటివరకు ఇలాంటి సర్జరీ రికార్డు కాలేదని ఆయన తెలిపారు.