న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పును అంగీకరిస్తున్నామని ఆప్ నాయకురాలు, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషి శనివారం తెలిపారు. ఇది తమ పార్టీకి ఓ ఎదురుదెబ్బ అని, అయితే బిజెపికి వ్యతిరేకంగా తమ పార్టీ పోరాడుతూనే ఉంటుందని అన్నారు. ఢిల్లీలో బిజెపి 26 ఏళ్లకు మించి తిరిగి అధికారంలోకి వచ్చిందన్నది ఇక్కడ గమనార్హం. ‘ఢిల్లీ ప్రజలు, మా పార్టీ కార్యకర్తలు దృఢంగానే నిలిచారు. అయితే మేము ప్రజా తీర్పును ఆమోదిస్తున్నాం. బిజెపి నిరంకుశత్వం, గూండాగిరిపై మా పోరాటం కొనసాగుతుంది.
ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి ఓ ఎదురుదెబ్బ. ఢిల్లీలో ప్రజల కోసం, దేశం కోసం ఆప్ పోరాడుతూనే ఉంటుంది’ అని ఆతిషి అన్నారు. కల్కాజీ సీటు ఫలితాన్ని ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించాల్సి ఉందని, అక్కడ బిజెపి అభ్యర్థి రమేశ్ విధురి, కాంగ్రెస్ అభ్యర్థి అల్కా లంబా తలపడుతున్నారని తెలిపారు. ‘ఆమ్ ఆద్మీ పార్టీ ఎల్లప్పుడూ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతుంది, ఈసారి ఎదురుదెబ్బ తగిలింది, అయినా ఆప్ పోరాడుతూనే ఉంటుంది’ అని తెలిపారు.