న్యూఢిల్లీ: ఇటీవల దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అంతా ఇది సెకండ్ వేవ్ అని చెబుతుండగా, ఢిల్లీలో మాత్రం ఫోర్త్ వేవ్ అంటున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. కేసులు పెరుగుతన్న తీరు పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, లాక్‌డౌన్ ఆలోచన లేదన్నారు. మార్చి 16న 425 కేసులు నమోదు కాగా, శుక్రవారం 3500 కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. అయితే, తాజా కేసుల్లో ప్రాణ నష్టం తక్కువగా ఉన్నదని కేజ్రీవాల్
తెలిపారు.
అక్టోబర్ నెలలో ఐసియులో చేర్చిన పేషెంట్ల సంఖ్యతో పోలిస్తే ఇప్పుడది తక్కువగా ఉన్నదని ఆయన గుర్తు చేశారు. అప్పుడు రోజుకు 40మంది మృతి చెందగా, ఇప్పుడా సంఖ్య 10కి తగ్గిందని ఆయన తెలిపారు. వ్యాక్సినేషన్‌కు వయో పరిమితిని తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. తాము యుద్ధ ప్రాతిపదికన వేల సంఖ్యలో వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎక్కువ మందికి టీకాలు ఇవ్వడం ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చునని ఆయన సూచించారు.