న్యూఢిల్లీ : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కలిసి గురువారం మరో 500 ఎలెక్ట్రిక్ బస్సులకు పచ్చజెండా ఊపారు. 2022 జనవరి నుంచి ఢిల్లీలో 800 ఎలెక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా, ఇప్పుడు మరో 500 బస్సులు చేరడంతో మొత్తం ఎలెక్ట్రిక్ బస్సుల సంఖ్య 1300 కు చేరుకుంది. ఈ బస్సులనీ జీరో ఎమిషన్ బస్సులనీ, ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఢిల్లీ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా మారుస్తామని లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా విలేఖరులకు వెల్లడించారు. కేజ్రీవాల్ ఈ సందర్భంగా సక్సేనాకు కృతజ్ఞతలు తెలియజేశారు. నగరంలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపరుస్తామన్నారు.
ఢిల్లీ రవాణా మంత్రి కైలాష్ గెహ్లాట్ తన ట్విటర్ ద్వారా లెఫ్టినెంట్ గవర్నర్‌కు, సిఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ బస్సులను ప్రారంభించడం ద్వారా కాలుష్యానికి వ్యతిరేకంగా పోరును మరింత బలోపేతం చేస్తుందన్నారు. 45 మిలియన్ కిమీ వరకు ఈ బస్సులు సర్వీస్ అందిస్తున్నాయని, ఇప్పటివరకు 34,000 టన్నుల కార్బన్ డైయాక్సైడ్‌ను తగ్గించడమైందన్నారు. 2025 నాటికి ఢిల్లీలో 10,480 వరకు ఎలెక్ట్రిక్ బస్సులు పెరుగుతాయని దీనివల్ల ఏటా 4.67 లక్షల టన్నుల కార్బన్‌డైయాక్సైడ్‌ను తగ్గించడానికి సహాయపడుతుందని మంత్రి తెలిపారు.