Tuesday, April 29, 2025

వృద్ధులకు రూ.10 లక్షల ఉచిత ఆరోగ్య సంరక్షణ

- Advertisement -
- Advertisement -

70 ఏళ్లు పైబడిన వయోవృద్ధులకు రూ.10 లక్షలవరకు ఉచిత వైద్య చికిత్సను అందించే “ ఆయుష్మాన్ వయ్ వందన ” పథకాన్ని ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించింది. రాజధానిలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేఖ గుప్తా, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో కలిసి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈమేరకు లబ్ధిదారులకు మొదటి వయ్ వందన కార్డులను పంపిణీ చేశారు. ఈ పథకం కింద అర్హులైన వయోవృద్ధులకు ఏటా రూ. 5 లక్షల వరకు ఉచితంగా వైద్య సహాయం అందుతుంది. అయితే అదనంగా ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక పథకం కింద మరో రూ. 5 లక్షల కవరేజ్ అందిస్తుంది. “ ట్రిపుల్ ఇంజిన్ మోడల్ కింద ఈ రకమైన కార్యక్రమం అమలు చేయడం ఇదే మొదటిదని, ఈ పథకంతో వృద్ధులను గౌరవించినందుకు ప్రధాని నరేంద్రమోడీకి తాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇందులో పేద, ధనిక అనే తేడా ఉండదు.

వారి ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పథకం నుండి ప్రయోజనం పొందుతారు ” అని ఆమె అన్నారు. ఢిల్లీ నగరం లోని 100 కి పైగా ఆస్పత్రులు ఈ పథకం పరిధి లోకి వచ్చాయి. 30,000 కి పైగా ఆస్పత్రులు నగదు రహిత చికిత్స కోసం నమోదు చేసుకున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. గత ఆప్ ప్రభుత్వం అహంకారం, రాజకీయ కారణాల వల్ల ఈ పథకాన్ని ఏడేళ్ల పాటు అమలు చేయకుండా ఆలస్యం చేసి అన్యాయానికి పాల్పడిందని విమర్శించారు. ఇప్పుడు ఈ పథకం ప్రయోజనాలు అందరికీ అందేలా తాము బాధ్యత తీసుకుంటామన్నారు. ఈ పథకం ఢిల్లీ లోని పౌరులకే కాకుండా, ఢిల్లీ బయట ఉన్నవారికి కూడా వర్తిస్తుందని, ఈ పథకంలో అందరూ తమ పేర్లు నమోదు చేయించుకోవాలని ఆరోగ్యమంత్రి పంకజ్ సింగ్ సూచించారు. కీమోథెరపీ, ఐసియు కేర్, సర్జరీలు, మరో 961 రకాల వైద్య చికిత్సలు ఈ పథకం కింద అమలవుతాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News