ఢిల్లీలో మళ్లీ కఠినంగా కొవిడ్ ఆంక్షలు
విద్యా సంస్థలు, సినిమాలు, జిమ్‌లు బంద్
సరి బేసి సంఖ్యలో దుకాణాలు, మాల్స్‌కు అనుమతి
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కొవిడ్ 19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు, సినిమా హాళ్లు, జిమ్ సెంటర్లను మూసివేస్తున్నట్లు ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ(డిడిఎంఎ) మంగళవారం ప్రకటించింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ కింద ఎల్లో అలర్ట్ ప్రకటించిన దరిమిలా దుకాణాలు, ప్రజా రవాణాపై వివిధ ఆంక్షలు విధిస్తూ డిడిఎంఎ ఉత్తర్వులు జారీచేసింది. నిత్యావసర వస్తువులు కాని వ్యాపార, వాణిజ్య సంస్థలు, సర్వీసులు, మాల్స్ ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు సరి బేసి సంఖ్య విధానంలో పనిచేయాల్సి ఉంటుంది. సోమవారం నుంచి అమలులోకి వచ్చిన రాత్రి కర్ఫూ సమయాన్ని మరో గంటపాటు పొడిగించారు. ఇక నుంచి రాత్రి కర్ఫూ 10 నుంచి ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటుంది. వివాహాలు, మరణాలకు హాజరయ్యే వారి సంఖ్యను 20కు పరిమితం చేశారు. రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక, మతపరమైన, ఉత్సవాలు వంటి కార్యక్రమాలను నిషేధించారు.
ఢిల్లీ మెట్రో 50 శాతం సీటింగ్ సామర్ధంతో పనిచేయడానికి డిడిఎంఎ అనుమతించింది. ఆటోలు, క్యాబ్‌లలో ఇద్దరు ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఉంటుంది. బస్సులు కూడా 50 శాతం సీటింగ్ సామర్ధంతో నడపాల్సి ఉంటుంది. 50 శాతం సీటింగ్ సామర్ధంతో రెస్టారెంట్లు ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తాయి. బార్లు మాత్రం పాత సీటింగ్ సామర్ధంతోనే పనిచేస్తాయి..కాని మధ్యాహ్నం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే తెరచి ఉంటాయి. ఎల్లో అలర్ట్ ప్రకారం అన్ని ఆంక్షలు తక్షణమే అమలులోకి వస్తాయని డిడిఎంఎ తెలిపింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం కరోనా పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న దృష్టా ఎల్లో అలర్ట్ జారీచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పాజిటివ్ కేసుల సంఖ్య వరుసగా రెండు రోజులు 0.5 శాతం కన్నా ఎక్కువ ఉన్నపుడు డిడిఎంఎ ఎల్లో అలర్ట్ ప్రకటిస్తుంది.
Delhi Govt shut Theatres and Schools due to Omicron