న్యూఢిల్లీ: తన కడుపులో పెరుగుతున్న 28 వారాల గర్భాన్ని విచ్ఛిన్నం చేసుకోవడానికి అనుమతించాలన్న ఒక మహిళ విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు సోమవారం అనుమతించింది. ఆమె గర్భంలో పెరుగుతున్న శిశువు కపాలంపై ఎముక ఏర్పడలేదని, అనెన్సెఫలీ అనే ఈపరిస్థితి వల్ల ఆ శిశువు జీవించే అవకాశం లేదని, ఈ కారణంగా ఆమెను అబార్షన్‌కు అనుమతించవచ్చని అఖిల భారత వైద్య శాస్త్రాల సంస్థ(ఎయిమ్స్) నియమించిన మెడికల్ బోర్డు నివేదిక ఇవ్వడంతో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. వైద్య బోర్డు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ మహిళ అబార్షన్ చేసుకోవడానికి చీఫ్ జస్టిస్ డిఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం అనుమతించింది. ఇందుకు సంబంధించిన సవివర ఉత్తర్వులను తర్వాత వెలువరిస్తామని కోర్టు తెలిపింది. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నన్సీ యాక్ట్, 1971 ప్రకారం 20 వారాలు దాటిన గర్భస్థ శిశువును అబార్షన్ ద్వారా తొలగించడం నిషిద్ధం. అయితే ఆ మహిళ 27 వారాల 5 రోజుల తన గర్భస్థ శిశువుకు అల్ట్రా సోనోగ్రఫీ చేయించినపుడు ఆ శిశువు పుర్రెపై ఎముక ఏర్పడలేదని వెల్లడైంది. జీవించడానికి అవకాశం లేని ఆ శిశువును అబార్షన్ ద్వారా తొలగించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆ మహిళ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఆ మహిళ అభ్యర్థనను పరిశీలించి నివేదిక ఇవ్వడానికి ఒక మెడికల్ బోర్డును ఏర్పాటు చేయవలసిందిగా ఈ నెల 7న ఎయిమ్స్‌ను హైకోర్టు ఆదేశించింది.
Delhi HC allows termination of 28 weeks pregnancy