Wednesday, January 22, 2025

ఆరాధ్య బచ్చన్‌పై తప్పుడు వార్తలు ఆపండి: యూట్యూబ్ చానల్స్‌కు హైకోర్టు ఆదేశం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు, ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్ కుమార్తె ఆరాధ్య బచ్చన్‌కు సంబంధించిన బూటకపు వార్తలను ప్రసారం చేయకుండా యుట్యూబ్ ఛానల్స్‌పై ఢిల్లీ హైకోర్టు గురువారం ఆంక్షలు విధించింది. 11 ఏళ్ల మైనర్ బాలికైన ఆరాధ్య బచ్చన్ శారీరక, మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియాలో బూటకపు వార్తలను ప్రసారం చేయరాదని హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.

తమ కుమార్తె ఆరాధ్యపై తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నారంటూ కొన్ని యూట్యూబ్ చానల్స్‌పై ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీటిని ప్రసారం చేయకుండా ఆయా యూట్యూబ్ చానల్స్‌ను నిరోధించాలని కోర్టును పిటిషనర్లు కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సి హరి శంకర్ సంబంధిత యూట్యూబ్ చానల్స్‌కు ఆదేశాలు జారీచేశారు. ఆరాధ్య బచ్చన్ శారీరక పరిస్థితిపై ఎటువంటి వార్తలు ప్రసారం చేయరాదని, గతంలో ప్రసారం చేసిన వీడియోలను తొలగించాలని కోర్టు ఆదేశించింది. సెలెబ్రిటీల పిల్లలైనా సామాన్యుల పిల్లలైనా.. ముఖ్యంగా మైనర్ పిల్లలపై తప్పుడు సమాచారంతో వార్తలు ప్రసారం చేయడం వారి హక్కులను హరించడమేనని కోర్టు పేర్కొంది.

తమ కుమార్తె ఆరాధ్య బచ్చన్ తీవ్ర అనారోగ్యం పాలైందని, ఆసుపత్రిలో చేరిందంటూ కొన్ని యూట్యూబ్ చానల్స్ తప్పుడు వార్తలను, వీడియోలను ప్రసాం చేస్తున్నాయని బచ్చన్ దంపతులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆరాధ్య మరణించినట్లు కూడా కొన్ని వీడియోలలో ప్రసారం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరాధ్యకు తక్షణమే సరైన వైద్యం అందించడంలో బచ్చన్ దంపతులు విఫలమయ్యారంటూకూడా ఈ వీడియోలలో ప్రచారం చేస్తున్నారని వారు తెలిపారు. ఆరాధ్య చాలా ఆరోగ్యంగా ఉందని, తమ కుమార్తె ఆసుపత్రిలో చేరలేదని బచ్చన్ దంపతులు పిటిషన్‌లో స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News