Friday, December 20, 2024

ఆమెకు అబార్షన్ తప్పితే వేరేదారి లేదు: ఢిల్లీ హైకోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అవలక్షణాల బిడ్డకు జన్మనివ్వడానికి ఇష్టపడని ఓ తల్లి తన ఏడు నెలలకు పైగా గర్భాన్ని తీయించుకునేందుకు సిద్ధపడింది. 31 సంవత్సరాల తల్లి కడపులోని 32 వారాల గర్భ విచ్ఛిత్తికి ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. వైద్యపరమైన ప్రక్రియతో ఈ మెడికల్ టర్మినేషన్ చేపట్టాలని ఆదేశించింది. తనకు పుట్టబోయే బిడ్డ అవలక్షణాలతో ఉంటుందని, ఈ విధంగా పుట్టే శిశువు తనకు మానసికంగా, శారీరకంగా ఇబ్బందికరం అవుతుందని తల్లి చేసుకున్న అభ్యర్థనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. న్యాయమూర్తి సంజీవ్ నరూలా ఈ మహిళ పిటిషన్‌కు సానుకూలంగా స్పందించారు.

నెలలు నిండుతున్న జీవి ఈ లోకంలోకి వచ్చినా అనేక రకాల అనారోగ్యాలతో బతకాల్సి వస్తుందని, తన గర్భం కొనసాగించలేనని తల్లి పేర్కొంది. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని న్యాయస్థానం ఆమె అబార్షన్‌కు అనుమతిని ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి స్థానిక ఎయిమ్స్ డాక్టర్ల బృందం వెలువరించిన నివేదికను జడ్జి పరిగణనలోకి తీసుకున్నారు. గర్భ విచ్ఛిత్తికి అనుమతి ఇవ్వడం తల్లికి బిడ్డకు కూడా శ్రేయస్కరం అని ఎయిమ్స్ నివేదికలో తెలిపారు.

ఈ వైద్య నివేదికను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఈ దశలో ఆమె అబార్షన్ తప్పితే వేరే దారి లేదని నిర్థారించుకుని ఈ ఉత్తర్వులకు దిగాల్సి వచ్చిందని జస్టిస్ సరూలా తెలిపారు. అల్ట్రాసౌండ్ పరీక్షలతో గర్భస్థ శిశువు అసాధారణ రీతిలో ఉందని నిర్థారణ అయిందని, దీనితో తనకు గత్యంతరం లేకపోవడంతో ఈ మార్గం వెతుక్కుంటున్నానని ఈ వివాహిత తెలిపింది. కోర్టు ఆదేశాల మేరకు ఎయిమ్స్ డాక్టర్లు ఆమెను పరీక్షించారు. శిశువు మెదడులో అత్యధిక స్థాయిలో ద్రావకాలు చేరుతాయని, ఇది తల్లికి కూడా చేటుగా ఉంటుందని నివేదిక తేల్చింది. దీనిని దృష్టిలో పెట్టుకుని అబార్షన్‌కు అనుమతించిన కోర్టు ఈ ప్రక్రియను ఈ తల్లి ఎంచుకునే వైద్య కేంద్రంలో చేసుకోవచ్చునని తెలిపింది. నెలలు నిండిన గర్భం విచ్ఛిత్తి వల్ల తలెత్తే ఎటువంటి పరిణామానికి అయినా మెడికల్ బోర్టు చట్టపరంగా బాధ్యత వహించాల్సిన అవసరం లేకుండా న్యాయస్థానం ఉపశమనం కల్పించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News