న్యూఢిల్లీ: ప్రజలతో నేతలయి, అధికారం ఏలే రాజకీయ నాయకులు బాధ్యతారహిత మాటలకు దిగడం పట్ల ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారికి ప్రజలంటే పట్టదు, ప్రజల బాగోగుల ఆలోచన లేదని, పైగా అదో ఇదో బాధ్యతారహిత ప్రకటనలు చేస్తూ ఉంటారని, కేవలం తమ పార్టీలు, రాజకీయ అజెండాలకు ప్రాధాన్యత ఇస్తారని హైకోర్టు పేర్కొంది. ఏదో ఒక దశలో ఇటువంటి రాజకీయ నేతలను ప్రజలు కొట్టి చంపినా న్యాయస్థానం ఆశ్చర్యపోదని ధర్మాసనం తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించింది. ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మధ్య సాగుతోన్న ఓ వ్యాజ్యం విచారణ దశలో హైకోర్టు స్పందన వెలువడింది. ఢిల్లీలో ప్రభుత్వం, మున్సిపల్ కార్పొరేషన్‌లు వేర్వేరు రాజకీయ పార్టీల ఆధిపత్యంలో ఉన్నాయి. ఈ దశలో ప్రజా సమస్యలు గాలికి కొట్టుకుపోతున్నాయి. పలు అంశాలపై వివాదాలు చెలరేగడం చివరికి సమస్యల పరిష్కారాలు అటకెక్కి ప్రజలు నలిగిపోవడం జరుగుతోంది.
రాజకీయ నాయకులు పౌరుల గురించి పట్టింపు లేకుండా మాట్లాడుతున్నారని.. ఇది పద్ధతి కాదని, ఇటువంటి నేతలపై దాడులు జరిగినా ముక్కున వేలేసుకునేదమీ లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాం? ఎటువంటి దేశం, ఎటువంటి సమాజానికి దారినిస్తున్నాం? కొందరి చేతలు మాటలు కట్టుబాట్లకు విరుద్ధంగా ఉంటున్నాయి. కేవలం వ్యక్తిగత లేదా రాజకీయ స్వార్థాలు, తమ భవితను దృష్టిలో పెట్టుకునే, బిగించుకున్న రాజకీయ అజెండాలతోనే ముందుకు పోతున్నట్లు ఉందని న్యాయమూర్తులు విపిన్ సంఘీ, రేఖా పల్లితో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఢిల్లీ మున్సిపల్ ఉద్యోగులకు జీతాల చెల్లింపులు లేకపోవడంపై దాఖలు అయిన పిటిషన్‌పై విచారణ దశలో న్యాయస్థానం తీవ్రస్థాయిలో స్పందించింది. ‘ఈ రాజకీయ తెగలు ఎప్పుడు పరిపక్వతకు వస్తారు? ఇటువంటి ధోరణికి ఎందుకు దిగుతారు? ఇదే విధంగా పరిణామాలు సాగితే ఏదో ఒకరోజు నేతలపై ప్రజలు తిరగబడటం జరిగి తీరుతుందని తేల్చిచెప్పారు.
Delhi High Court fires on Politicians