Sunday, April 6, 2025

న్యాయ వ్యవస్థలో ఏదీ పారదర్శకత?

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటి ప్రాంగణంలో నోట్ల కట్టల దగ్ధం వ్యవహారం న్యాయ వ్యవస్థపై కమ్ముకున్న అసంతృప్తి, అవిశ్వాసులకు ఆజ్యం పోస్తోంది. ఈ విషయమై బహిరంగ దర్యాప్తుకు, చర్చకు అటు సుప్రీం కోర్టు, ఇటు కేంద్ర ప్రభుత్వం సైతం నిరాకరించడంతో న్యాయ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం ప్రశ్నార్థ్ధకంగా మారుతున్నాయి. సాధారణ నేర దర్యాప్తు ప్రక్రియకు తిలోదకాలిచ్చి, అంతర్గత విచారణ పేరుతో కనీసం ఎఫ్‌ఐఆర్ దాఖలుకు సైతం సుప్రీం కోర్టు నిరాకరిస్తుంది. అంతర్గత విచారణ నివేదిక అనంతరం చూద్దాం అంటున్నది. మరోవంక, ఈ విషయమై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ చొరవ తీసుకొని తన ఛాంబర్‌లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు గాని పార్లమెంట్ ఉభయ సభలలో ఈ విషయమై చర్చించేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయడం లేదు.

ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునే మన దేశంలో మాత్రమే పార్లమెంటు సభ్యులు తమ జీతాలను తామే పెంచుకొంటుంటారు. న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకొంటుంటారు. ఈ వ్యవస్థలపై వస్తున్న తీవ్రమైన ఆరోపణల విషయంలో బహిరంగ విచారణకు సిద్ధపడరు. నోట్ల కట్టల దగ్ధం విషయంలో జస్టిస్ వర్మను దోషిగా పేర్కొనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన నివేదికలో స్పష్టం చేశారు. ఆ నివేదికను వెబ్ సిట్‌లో ప్రచురించడం ద్వారా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ ఖన్నా అత్యున్నత స్థాయిలో పారదర్శకతకు దోహదపడ్డారని ప్రశంసలు అందుకున్నారు. అయితే ఆ వెంటనే ఈ విషయమై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా సుప్రీం కోర్టు నివారించడం విస్మయం కలిగిస్తోంది.

మూడు నెలల వ్యవధిలో న్యాయమూర్తులపై ఆంతరంగిక విచారణకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ ఖన్నా ఆదేశించడం ఇది రెండో సంఘటన కావడం గమనార్హం. గత డిసెంబర్‌లో అలహాబాద్ న్యాయమూర్తి శేఖర్ యాదవ్ ఉమ్మడి పౌరస్మృతి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు సైతం ఇటువంటి నిర్ణయమే తీసుకున్నారు. మరోవంక జస్టిస్ వర్మను బార్ అసోసియేషన్‌ల అభ్యంతరాలను ఖాతరు చేయకుండా అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడం ద్వారా సుప్రీం కోర్టుతో పాటు, కేంద్ర ప్రభుత్వం సైతం వ్యవహరించిన తీరు మన న్యాయవ్యవస్థలో ఎటువంటి జవాబుదారీతనానికి దోహదపడదని స్పష్టం అవుతుంది. అయితే నేడు న్యాయస్థానాలు, న్యాయమూర్తుల ప్రవర్తన పట్ల సమాజం సునిశితంగా గమనిస్తోంది మరచిపోతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలలో వారి వ్యవహారాలు తరచూ బహిర్గతం అవుతున్నాయి.

అదే విధంగా అవినీతి ఆరోపణలు తలెత్తినప్పుడు ఆరోపణలకు గురైన వారిని బదిలీ చేయడం ద్వారా ప్రజల దృష్టి మళ్లించే పాతకాలపు ప్రయత్నాలు ఇప్పుడు చెల్లుబాటు కావని కూడా గుర్తించాలి. అదే ధోరణిలో వెంటనే జస్టిస్ వర్మను అలహాబాద్‌కు బదిలీ చేస్తూ కొలీజియం నిర్ణయం తీసుకోగానే ‘మీకు పనికిరాని చెత్త’ను మాకు పంపుతారా? అంటూ అలహాబాద్ బార్ అసోసియేషన్ ఆగ్రహం, నిరసన వ్యక్తం చేయడం గమనించాలి. గతంలో సహచర న్యాయమూర్తులు తీవ్రమైన అవినీతి చర్యలకు పాల్పడ్డారని నిర్దుష్టమైన ఆరోపణలు చేసిన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిని నేరుగా జైలుకు పంపారు. న్యాయమూర్తులపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చిన సమయంలో పారదర్శకంగా న్యాయ వ్యవస్థ గాని, ప్రభుత్వం గాని స్పందించడం లేదు. దానితో మన న్యాయవ్యవస్థలో పారదర్శకత ప్రశ్నార్థకంగా మారింది. అవినీతి ఆరోపణలపై విచారణకు చట్టప్రకారం నిర్దిష్టమైన ప్రక్రియ ఉంది.

కేంద్ర ప్రభుత్వం సైతం తమపై వచ్చిన ఎటువంటి అవినీతి ఆరోపణలపై ప్రాథమిక విచారణకు సైతం సిద్ధపడటం లేదు. మరోవంక న్యాయవ్యవస్థ సైతం అటువంటి విధానాన్నే అనుసరిస్తుంది. ప్రజాస్వామ్యంలో మూలస్తంభాలుగా భావించే కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అనుసరిస్తున్న తీరు మన వ్యవస్థ పట్ల ప్రజలలో ఎటువంటి విశ్వాసాన్ని చూరగొనేందుకు దోహదపడటం లేదని చెప్పవచ్చు. గతంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన ఆరుగురు అవినీతి చర్యలకు పాలపడ్డారని అంటూ మాజీ కేంద్ర న్యాయశాఖ మంత్రి శాంతి భూషణ్ నిర్దుష్టమైన ఆరోపణలు చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. సుప్రీం కోర్టులో అనుకూలంగా తీర్పు ఇవ్వగానే, సంబంధిత న్యాయమూర్తి వేరేచోట ఆస్తులు సమకూర్చుకోవడాన్ని చూపారు.

శాంతి భూషణ్ మృతి చెందారు. ఆయన కుమారుడు ప్రశాంత్ భూషణ్ ఈ కేసులో పిటిషన్ దారునిగా చేరారు. అయినా ఈ పిటిషన్‌ను విచారించే సాహసం అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికీ చేయడం లేదు. అయితే ఈ అంశాన్ని ఆసరాగా తీసుకుని న్యాయమూర్తుల నియామకంలో సంస్కరణల అంశంను మరోసారి తెరపైకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ జరిపిన అఖిలపక్ష సమావేశంలో సైతం ఈ సంస్కరణ అంశాన్నే ప్రముఖంగా ప్రస్తావించడం గమనార్హం. న్యాయమూర్తి ఇంట్లో భారీగా నోట్లకట్టలు బయటపడటంపై దేశవ్యాప్తంగా సామాన్యుల్లో సైతం ఆగ్రహం వ్యక్తం కావడం వంటి పరిణామాలను అవకాశంగా తీసుకుని నరేంద్ర మోడీ ప్రభుత్వం జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జెఎసి)పై మరోసారి పార్లమెంట్ ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.

గతంలో ఎన్‌జెఎసిని తిరస్కరించిన సుప్రీం కోర్టు ప్రస్తుత పరిస్థితుల్లో అలా వ్యతిరేకించే అవకాశాలు లేవని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ తాము అలాంటి బిల్లును ప్రవేశపెడితే గతంలో లభించిన విధంగానే ఈసారి కూడా దానికి కాంగ్రెస్‌తో సహా అన్ని పక్షాలు ఏకగ్రీవ ఆమోదం లభిస్తుందని మోడీ ప్రభుత్వం విశ్వాసంతో ఉన్నది. ఈ విషయంలో ప్రభుత్వం తన ప్రతిపాదన ఏమిటో స్పష్టంగా చెబితే తామూ తమ వైఖరి చెప్తామని కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు అఖిలపక్ష భేటీలో పేర్కొనడం గమనార్హం. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జెఎసి) బిల్లును సుప్రీంకోర్టు 2015లో కొట్టివేయడం పై ధన్‌ఖడ్ పలు సందర్భాలలో బాహాటంగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

న్యాయవ్యవస్థలో నియామకాలు లోపభూయిష్టంగా ఉన్నాయన్న విషయంలో తమకు సందేహం లేదని కాంగ్రెస్‌తో సహా పలు పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. గతంలో మాదిరి జాతీయ న్యాయనియామకాల కమిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేస్తే ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలేమిటో (రోడ్ మ్యాప్) కూడా చెప్పాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతానికైతే న్యాయ నియామకాలు పారదర్శకంగా జరగడం లేదని, ఇందుకు ప్రత్యామ్నాయం అవసరమనే విషయంలో మరో అభిప్రాయానికి తావులేదు. కానీ నేడు కేంద్ర ప్రభుత్వం జాతీయ న్యాయ నియామకాల కమిషన్ పట్ల చూపుతున్న ఆసక్తి న్యాయవ్యవస్థలో సంస్కరణలు తీసుకు రావడం గురించి కాదని, న్యాయమూర్తుల నియామకంలో ప్రభుత్వ పెత్తనం కోసం పడుతున్న ఆరాటం అని ఈ సందర్భంగా గమనించాలి. ప్రస్తుతం కొలీజియం వ్యవస్థలో అనేక లోటుపాట్లు ఉన్నప్పటికీ, న్యాయమూర్తుల నియామకంలో పారదర్శకత ఉండటం లేదని విమర్శలు చెలరేగుతున్నప్పటికీ ప్రభుత్వానికి ఆ పెత్తనం అప్పగిస్తే ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశింపలేము.

కనీసం కొద్ది మందినైనా నిజాయితిపరులు, ప్రతిభ గలవారు, చట్టం పట్ల అవగాహన అవగాహన కలిగిన వారు కొలీజియం వ్యవస్థ ద్వారా ఎంపిక కాగలుగుతున్నారు. పలు కేసుల విషయంలో నిర్భయంగా తీర్పులు ఇవ్వగలుగుతున్నారు. కానీ, ప్రభుత్వం కొలీజియం సిఫార్సుల విషయంలో వ్యవహరిస్తున్న విధానం చూస్తుంటే తమకు లొంగిపోరనే అనుమానాలున్న వారి నియామకాలకు ఎటువంటి కారణం లేకుండా అడ్డుపడుతున్నది. కొలీజియం సిఫార్సు చేసిన అనేక మంది న్యాయమూర్తుల నియామకాలను నిలిపివేస్తున్నారు. అందుకు ఎటువంటి కారణాలు కూడా చూపడం లేదు. కనీసం సిఫార్సులను తిరిగి వెనుకకు కూడా పంపించలేదు.

తగిన ప్రతిభలేని వారు అనేక మంది ప్రభుత్వ సిఫార్సులతో న్యాయమూర్తులుగా నియామకం పొందుతున్నారు. అనేక మంది న్యాయమూర్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చేందుకు వెనకడుగు వేస్తున్నారు. సుప్రీం కోర్టు, హైకోర్టులలో పేరుకుపోయిన కేసులలో సుమారు 80 శాతం వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే నిందితులుగా ఉండటం గమనార్హం. ఏది ఏమైనా జస్టిస్ వర్మ కేసు న్యాయవ్యవస్థ జవాబుదారీతనానికి ఓ పరీక్ష వంటిదని గుర్తించాలి. తమపై వస్తున్న ఆరోపణలను ఏమేరకు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా న్యాయస్థానాలు పరిశీలిస్తాయో అని ప్రజలు గమనిస్తున్నారని గమనించాలి. ఇది కేవలం ఒక న్యాయమూర్తి ప్రవర్తనకు సంబంధించిన అంశం కానేకాదు. మన న్యాయవ్యవస్థ నిజాయితీ, పారదర్శకతలకు సంబంధించిన ప్రశ్నలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

చలసాని నరేంద్ర
98495 69050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News