Friday, February 21, 2025

అతిగా టిక్కెట్లు ఎందుకు అమ్మారు?:ఢిల్లీ హైకోర్టు

- Advertisement -
- Advertisement -

క్రితం వారం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో సంభవించిన తొక్కిసలాట ఘటనపై కేంద్రాన్ని, భారతీయ రైల్వేలను ఢిల్లీ హైకోర్టు బుధవారం తీవ్ర స్థాయిలో తూర్పారబట్టింది. ఒక బోగీలో పట్టే ప్రయాణికుల సంఖ్యకు మించి టిక్కెట్ల అమ్మకాన్ని రైల్వేలు ఎందుకు కొనసాగించినట్లు అని ప్రధాన న్యాయమూర్తి డికె ఉపాధ్యాయ్, న్యాయమూర్తి తుషార్ రావ్ గెడెలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. కేంద్రం, రైల్వే శాఖ సమాధానం ఇవ్వాలని ఆగ్రహ స్వరంతో కోర్టు అడిగింది. అటువంటి దుర్ఘటనల నివారణకు, బోగీకి ప్రయాణికులను పరిమితం చేసే, నిబంధనను ఉల్లంఘించేవారికి ఆరు నెలల జైలు శిక్షను నిర్దేశిస్తున్న రైల్వేల చట్టంలోని సెక్షన్ అమలుకు చర్యలు కోరుతున్న పిల్‌పై కోర్టు విచారణ జరుపుతోంది. సదరు సెక్షన్ 147 రూ. 1000 జరిమానాను కూడా నిర్దేశిస్తోంది.’

‘బోగీల్లో ప్రయాణికుల సంఖ్యను పరిమితం చేసే, అనధికారంగో బోగీల్లోకి ప్రవేశించే వ్యక్తులకు జరిమానా విధించే ప్రస్తుత చట్టాల అమలుకు మీరు ఏ చర్యలు తీసుకుంటారో చూపండి’ అని కోర్టు ఆవేశపూరిత స్వరంతో అడిగింది.‘(రైల్వేల చట్టం) సంబంధిత సెక్షన్లను పరిశీలించిన మీదట& ప్రతి రైల్వే పాలనయంత్రాంగం ప్రయాణికుల కచ్చిత సంఖ్యను తప్పనిసరిగా నిర్ధారించవలసి ఉంటుందని, ఆ సంఖ్యను బోగీ వెలుపల స్పష్టంగా ప్రదర్శించవలసి ఉంటుందని తెలుస్తోంది’ అని కోర్టు పేర్కొన్నది. ‘ఒక సాధారణ విషయాన్ని సకారాత్మక పద్ధతిలో, తుచ తప్పకుండా మీరు అనుసరించి ఉన్నట్లయితే ఈ పరిస్థితి (ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట) తప్పిపోయి ఉండేది’ అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. ‘రద్దీ రోజుల్లో రైల్వేలు తగిన కారణంతో అనుమతించిన పరిమితికి మించి ప్రయాణికులకు వసతి కల్పించవచ్చునని కోర్టు అంగీకరించింది. అయితే, గరిష్ఠ సీటింగ్ స్థాయిని పాటించడం ‘అలక్షం చేసినట్లుగా కనిపిస్తోంది’ అని కోర్టు పేర్కొన్నది. ‘బెర్త్ సంఖ్యను మించి టిక్కెట్లను ఎందుకు విక్రయించారు? అదే సమస్య’ అని కోర్టు అన్నది.

కోర్టు ఆగ్రహాన్ని ఎదుర్కొన్న, రైల్వేల తరఫున హాజరవుతున్న సొలిసిటర్ జనరల తుషార్ మెహతా కోర్టు ఆదేశాలను అంగీకరించారు. రైల్వే బోర్డు ఈ పరిస్థితికి సంబంధించిన అన్ని అంశాలను పరిశీలిస్తుందని ఆయన చెప్పారు. ఆ తరువాత కోర్టు మార్చి 26న తదుపరి విచారణ నిర్వహించనున్నట్లు తెలియజేసింది. క్రితం వారం న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాటలో దుర్మరణం చెందిన 18 మందిలో 11 మంది మహిళలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. తొక్కిసలాటకు అనేక కారణాలు ఉన్నాయి. కానీ, వాటిలో అత్యంత కీలకమైనది ఏమిటంటే రెండు గంటల్లో సుమారు 3000 టిక్కెట్లను స్టేషన్ అధికారులు విక్రయిస్తూనే ఉండడం అని అభిజ్ఞ వర్గాలు ఒక టివి చానెల్‌తో చెప్పాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News