రాహుల్ గాంధీ భారతీయ పౌరసత్వంపై నిర్ణయించేందుకు కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బిజెపి నేత సుబ్రహ్మణ్యం స్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై తన వైఖరి స్పష్టం చేయాలని కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ విషయంలో ఉత్తర్వులు స్వీకరించవలసిందిగా కేంద్ర ప్రభుత్వం తరఫు ప్రాక్సీ న్యాయవాదిని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి విభు బఖ్రు, న్యాయమూర్తి తుషార్ రావు గెడెలాతో కూడిన ధర్మాసనం మౌఖికంగా కోరింది.
‘మేము ఉత్తర్వు జారీ చేసే ముందు ప్రభుత్వం తరఫున న్యాయవాది సాయం కావాలని అనుకుంటున్నాం’ అని బెంచ్ తెలిపింది. పిటిషన్‌పై నోటీస్ జారీ చేయడానికి కోర్టు తొలుత సుముఖత కనబరచింది.కానీ ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదికి సీనియర్ న్యాయవాదిగా హోదా మార్చారని కేంద్రం ప్రాక్సీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసులో కొత్త న్యాయవాది పాల్గొనడానికి కొంత వ్యవధి ఇవ్వాలని ఆయన కోరారు. బెంచ్ ఈ వ్యవహారంపై విచారణను జనవరి 13కు వాయిదా వేసింది.