Monday, December 23, 2024

కేజ్రీవాల్ వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టు ప్రశ్నలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మద్యం స్కామ్ కేసులో అరెస్టు అయి జైలుకు వెళ్లినా సిఎంగా కొనసాగడం కేజ్రీవాల్ వ్యక్తిగతం కావచ్చు. అయితే మరి వేలాది మంది ఢిల్లీ సర్కారు బడుల విద్యార్థుల పుస్తకాలు, డ్రెస్సులు, ఏకంగా వారి విద్యా హక్కు సంగతి ఏమిటీ? అని ఢిల్లీ హైకోర్టు సోమవారం ప్రశ్నించింది. ఆయన పదవిలో ఉంటూ జైలులో గడపాల్సి రావడం వల్ల విద్యార్థుల ప్రయోజనాలు దెబ్బతినాలా? వారి చదువుకునే ప్రాధమిక హక్కు విచ్ఛిన్నం కావల్సిందేనా అని హైకోర్టు నిలదీసింది.

కేజ్రీవాల్ జైలులో ఉండటం వల్ల విద్యార్థులకు అందాల్సిన పుస్తకాలు, డ్రస్సుల విషయంలో తామేమీ నిర్ణయం తీసుకోలేకపోతున్నామనే ఢిల్లీ ఆమ్ ఆద్మీపార్టీ ప్రభుత్వ అధికార యంత్రాంగం వాదనపై యాక్టింగ్ చీఫ్ జస్టిస్ మన్మోహన్ , జస్టిస్ మన్మీత్ పిఎస్ అరోరాతో కూడిన హైకోర్టు ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ఢిల్లీ మున్సిపల్ ’ఎంసిడి) స్కూళ్లలోని విద్యార్థులకు సంకట స్థితి ఎందుకు అని చురకలు పెట్టింది.

ఆయన సిఎంగా ఉండనివ్వండి, దీనిపై తాము స్పందించదల్చుకోలేదని, పిల్లలకు అవసరమైన వాటి గురించే తమకు సరైన స్పందన కావాలని తెలిపారు. సిఎం పదవి కేవలం లాంఛనప్రాయం కాదని, కేవలం దేశ రాజధాని ఢిల్లీ ఒక్కటే కాదు, ఏ రాష్ట్రం సిఎం అయినా తన కార్యాలయం ద్వారా ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై స్పందించాల్సి ఉంటుంది. అధికారులను అప్రమత్తం చేయడం అవసరం. ప్రకృతి వైపరీత్యాలు సంభవించవచ్చు లేదా తక్షణ రీతిలో ప్రభుత్వం నుంచి సాయం అందడం కానివ్వండి , ప్రజల సాధకబాధకాలను పట్టించుకోవల్సి ఉంటుందని, మరి ఢిల్లీ సిఎం విషయంలో ఏమి జరుగుతోంది? ప్రజల సమస్యలు ఆయన జైలుకు వెళ్లడం వల్ల ఏ దుర్గతిలో ఉందనేది కీలకం అని ధర్మాసనం తెలిపింది.

కీలక స్థానాలలో ఉండే వారు ఖచ్చితంగా ఎల్లవేళలా ఎటువంటి విషయాలలో అయినా స్పందించేందుకు సిద్ధంగా ఉండాల్సిందే. మరి ఇక్కడ అది వీలవుతోందా అని పేర్కొంటూ మరికొన్ని కీలక వ్యాఖ్యలు వెలువరించింది. ’ ప్రధాన బాధ్యతలో ఉండే వారు ఎక్కువ కాలం అందుబాటులో లేకుండా ఉండటం లేదా, విధులకు ప్రత్యక్షంగా హాజరుకాలేకపోవడం, దీనిపై సందిగ్థత నెలకొంటూ ఉండటం వల్ల జాతీయ, ప్రజా ప్రయోజనాల విషయాలు ప్రస్తావనకు వస్తాయి.

పైగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతున్నామని చెప్పడం దారుణం. దీనిపై లోతుగా విశ్లేషించాల్సి ఉంటుంది’ అని ధర్మాసనం తెలిపింది. ఢిల్లీ ఎంసిడి బడులవిద్యార్థులకు పుస్తకాలు అందడం లేదని, పేద విద్యార్థులకు ఇబ్బంది ఏర్పడుతోందని పేర్కొంటూ న్యాయవాది అశోక్ అగర్వాల్ స్వచ్ఛంద సేవాసంస్థ సోషల్ జురిస్ట్ తరఫున హైకోర్టులో పిటిషన్ వేశారు. ఢిల్లీ సిఎంగా కేజ్రీవాల్ కొనసాగింపు విషయంపై కీలక రూలింగ్ ఉంటుందని శనివారం ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఈ క్రమంలోనే సోమవారం విచారణ జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News