Wednesday, January 22, 2025

కాంగ్రెస్‌కు చుక్కెదురు

- Advertisement -
- Advertisement -

రూ. 100 కోట్లకు పైగా పన్ను బకాయి వసూలు కోసం కాంగ్రెస్ పార్టీకి ఆదాయపు పన్ను (ఐటి) శాఖ ఇచ్చిన నోటీస్‌పై స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ ఐటి అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఐటిఎటి) జారీ చేసిన ఉత్తర్వును ఢిల్లీ హైకోర్టు బుధవారం ధ్రువీకరించింది. ఐటిఎటి ఈ నెల 8న జారీ చేసిన ఉత్తర్వులో జోక్యం చేసుకోవలసిన అవసరం ఏమీ లేదని న్యాయమూర్తులు యశ్వంత్ వర్మ, పురుషైందర్ కుమార్ కౌరవ్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ, ఐటి శాఖ తరఫున వాదనలు విన్న తరువాత బెంచ్ మంగళవారం తీర్పును రిజర్వ్ చేసింది. తన దగ్గర నుంచి బకాయిల వసూలుకు ఉపక్రమిస్తూ ఐటి శాఖ

ఫిబ్రవరి 13న ఇచ్చిన నోటీస్‌పై స్టే కోరుతూ కాంగ్రెస్ ఇచ్చిన అర్జీని ఐటిఎటి తోసిపుచ్చిన తరువాత హైకోర్టును ఆశ్రయించింది. 2018-19 మదింపు సంవత్సరంలో కాంగ్రెస్ ఆదాయం రూ. 199 కోట్ల కన్నా ఎక్కువగా ఉన్నందున రూ. 100 కోట్లకు పైగా పన్ను చెల్లించవలసి ఉంటుందని మదింపు అధికారి తేల్చారు. తమకు కొంత ఉపశమనం కలిగించాలని, లేనిచో పార్టీ కుప్పకూలుతుందని కాంగ్రెస్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అసలు పన్ను డిమాండ్ రూ. 102 కోట్లు అని, వడ్డీతో కలసి అది రూ. 135.06 కోట్లకు పెరిగిందని ఐటి శాఖ న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. రూ. 65.94 కోట్ల మేరకు పన్ను రాబట్టినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News