కేంద్రానికి నోటీసులు
న్యూఢిల్లీ: దేశంలోని 2-18 సంవత్సరాల మధ్య వయస్కులకు కోవ్యాక్సిన్ రెండు, మూడవ దశ వైద్య ప్రయోగాలను నిర్వహించడానికి భారత్ బయోటెక్ ఫార్మా కంపెనీకి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డిసిజిఐ) ఇచ్చిన అనుమతిని నిలిపివేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై బుధవారం విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వ వైఖరిని కోరుతూ నోటీసులు జారీచేసింది. ఈ పిల్‌పై తమ వైఖరిని జులై 15 లోగా తమ వైఖరిని తెలియచేయాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ, శఙశు అభివృద్ధి శాఖ, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సిడిఎస్‌సిఓ), భారత్ బయోటెక్‌కు చీఫ్ జస్టిస్ డిఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం నోటీసులు జారీచేసింది. 2-18 ఏళ్ల మధ్యవయస్కులకు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు మే 12వ తేదీన భారత్ బయోటెక్‌కు డిసిజిఐ ఇచ్చిన అనుమతిని నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని పిటిషనర్ సంజీవ్ కుమార్ చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.