Saturday, July 6, 2024

కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై రేపు ఢిల్లీ హైకోర్టు విచారణ

- Advertisement -
- Advertisement -

జులై 12 వరకు జుడిషియల్ కస్టడీ పొడిగింపు

న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించి సిబిఐ నమోదు చేసిన అవినీతి కేసులో బెయిల్ కోరుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపేందుకు ఢిల్లీ హైకోర్టు బుధవారం అంగీకరించింది. బుధవారం ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసిన కేజ్రీవాల్ తరఫు న్యాయవాది దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని కోర్టును కోరారు. దీనికి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్, జస్టిస్ తుషార్ రావు గేదెలతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ శుక్రవారం విచారణ జరుగుపుతామని తెలిపింది.

కాగా..ఇదే కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) అరెస్టు చేయడంతో తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్‌ను జూన్ 26న సిబిఐ జైలులోనే అరెస్టు చేసింది. సిబిఐ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఆప్ కన్వీనర్ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మార్చి 21న ఇడి కేజ్రీవాల్‌ను అరెస్టు చేయగా జూన్ 20న దిగువ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

అయితే బెయిల్‌ను సవాలు చేస్తూ ఇడి హైకోర్టును ఆశ్రయించగా బెయిల్‌పై కోర్టు స్టే ఇచ్చింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో అక్రమాలు, అవినీతి చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సిబిఐ దర్యాప్తునకు ఆదేశించిన దరిమిలా ఈ ఎక్సైజ్ పాలసీ రద్దయ్యింది. ఇదిలా ఉండగా ఎనైజ్ పాలసీ కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు జుడిషియల్ రిమాండ్‌ను జులై 12 వరకు పొడిగిస్తూ స్థానిక కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఎదుట కేజ్రీవాల్ హాజరయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News