Friday, November 15, 2024

ఢిల్లీ కంట్రోల్ అంతా లెఫ్టినెంట్ గవర్నర్‌దే

- Advertisement -
- Advertisement -

Delhi is now in hands of Lieutenant Governor

చట్టం వెలువరించిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ : ఢిల్లీ పెత్తనం బత్తెం ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లోకి వెళ్లింది. ఢిల్లీ మహానగరంలో పరిపాలనా వ్యవహారాలలో లెఫ్టినెంట్ గవర్నర్‌కు అక్కడి ఎన్నికైన ప్రజా ప్రభుత్వం కన్నా ఎక్కువ అధికారాలు కల్పించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం (సవరణ) చట్టం 2021ను వెలువరించింది. ఈ సవరించిన చట్టం ఈ నెల 27 నుంచి అమలులోకి వచ్చినట్లే అని ఈ నోటిఫికేషన్‌లో తెలిపారు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో ఎన్నికైన ఆప్ ప్రభుత్వం అధికారంలో ఉంది. చట్ట శాసనపరమైన, కార్యనిర్వాహకపరమైన పలు అంశాలలో తరచూ లెఫ్టినెంట్ గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి వివాదాలు చెలరేగుతూ వచ్చాయి. అయితే వీటిని పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం తీసుకువచ్చి ఎల్‌జి అధికారాలను మరింత విస్తృతం చేసింది. ఇది కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికి మధ్య ఉన్న ప్రచ్ఛన్నపోరును ఇప్పుడు ప్రత్యక్ష పోరు స్థాయికి తీసుకువచ్చింది.

కేంద్ర హోం మంత్రిత్వశాఖ వెలువరించిన నోటిఫికేషన్ మేరకు తాజా పరిణామాలను పొందుపర్చారు. కేంద్ర రాజధాని ప్రాంతపు చట్టం పరిధిలోని సెక్షన్లను ఇప్పటి నుంచి అంటే ఈ నెల 27 నుంచి ఢిల్లీకి వర్తింపచేస్తున్నామని ఇందులో తెలిపారు. ప్రస్తుత చట్టంలోని నిబంధనలకు సంబంధించిన బిల్లును ఈ ఏడాది మార్చిలోనే ఆమోదించారు. ఇకపై ఢిల్లీలో ప్రభుత్వం అంటే కేవలం లెఫ్టినెంట్ గవర్నర్‌గానే అధికారిక చలామణి ఉంటుంది. ఈ ఆమోదిత బిల్లు మేరకు లెఫ్టినెంట్ గవర్నర్‌కు విస్తృత స్థాయి అపరిమిత అధికారాలు ఉంటాయి. ఓ విధంగా చూస్తే తిరుగులేని అధికారిక కేంద్రంగా లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహరించవచ్చు.

ఇకపై ఢిల్లీకి సంబంధించి ఎటువంటి కార్యనిర్వాహక, లేదా క్షేత్రస్థాయి అంశాలపై అయినా కేంద్రం ఎల్‌జి అభిప్రాయాన్ని కీలకంగా తీసుకుంటుంది. ఈ మేరకు తదుపరి కార్యాచరణకు దిగేందుకు వీలేర్పడుతుంది. చివరికి ఢిల్లీ మంత్రిమండలి తీసుకునే సమిష్టి నిర్ణయాల విషయంలోనూ లెఫ్టినెంట్ గవర్నర్ అభిప్రాయమే కేంద్రం పరమావధిగా తీసుకుంటుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు కరోనా ఉధృతి, దీని నివారణకు అవసరం అయిన రీతిలో ఆసుపత్రులలో ఆక్సిజన్ సరఫరాలు లేకపోవడంపై కేంద్రం ఢిల్లీ ప్రభుత్వాల మధ్య వివాదాలు రాజుకుంటున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News