న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంఎల్‌ఏలు సోమవారం లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి నిరసన ర్యాలీ నిర్వహించారు. నగర పాలనలో లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం చేసుకుంటున్నారంటూ వారు ఈ నిరసన ప్రదర్శన చేపట్టారు. సోమవారం ఢిల్లీ అసెంబ్లీ వాయిదా పడ్డాక వారు ఈ ప్రదర్శన చేపట్టారు.
‘లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ ఎంఎల్‌ఏలు నిరసన ప్రదర్శన చేపట్టాల్సి రావడం దురదృష్టకరం. ఆయన తన తప్పులు తెలుసుకుంటారనుకుంటున్నాను. ఫిన్లాండ్‌లో టీచర్స్ ట్రయినింగ్‌కు అనుమతిస్తారనుకుంటున్నాను’ అని కేజ్రీవాల్ విలేకరులతో అన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ వికె. సక్సేనా ఏకపక్ష నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. కానీ ఆయన అలా చేయకూడదన్నారు. ‘మా హోంవర్క్‌లు చూడ్డానికి ఆయన ఏమైనా హెడ్‌మాస్టర్ అనుకుంటున్నారా. మా ప్రతిపాదనలపై ఆయన అవునో, కాదో మాత్రమే చెప్పాలి’ అన్నారు. ‘ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అధికారం ఎన్నికైన ప్రభుత్వానికి లేకపోతే అదెలా పనిచేస్తుంది?’ అన్నారు.
లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా అక్రమంగా, అనవసరంగా జోక్యం చేసుకోవడంపై బిజెపి ఎంఎల్‌ఏలు, ఆప్ ఎంఎల్‌ఏల మధ్య మాటలయుద్ధం జరిగాక అసెంబ్లీ కార్యక్రమాలు వాయిదాపడ్డాయి. ‘ఢిల్లీ ప్రభుత్వ టీచర్లను ట్రయినింగ్ కోసం ఫిన్లాండ్ పంపాలి’ అని లెఫ్టినెంట్ గవర్నర్ అనడంపై ఆప్ ఎంఎల్‌ఏలు అభ్యంతరం లేవనెత్తారు.