Monday, December 23, 2024

హోంమంత్రి కైలాష్ గెహ్లాట్‌కు జెండా వందనం బాధ్యత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఢిల్లీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే బాధ్యతను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్‌జి) వికె సక్సేనా రాష్ట్ర హోం మంత్రి కైలాష్ గెహ్లాట్‌కు అప్పగించినట్లు రాజ్ నివాస్ అధికారులు మంగళవారం ప్రకటించారు. ఇతర సీనియర్ నాయకులను కాదని హోం మంత్రిని ఎంపిక చేయడంతో ఆప్ ప్రభుత్వానికి, ఎల్‌జి సచవాలయానికి మధ్య మరోసారి వివాదం చెలరేగే అవకాశం కనపడుతోంది. ఛత్రాసాల్ స్టేడియంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి స్వాతంత్య్ర వేడుకలలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేందుకు హోం మంత్రి కైలాష్ గెహ్లాట్‌ను నామినేట్ చేస్తున్నట్లు ఎల్‌జి సక్సేనా ఢిల్లీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నరేష్ కుమార్‌కు పంపిన లేఖలో తెలిపారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను చేపట్టాలని ఆయన ఆదేశించారు.

అంతకుముందు.. తన తరుఫున ఢిల్లీ మంత్రి అతిషికి జాతీయ పతాక ఆవిష్కరణ బాధ్యతను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అప్పగించగా, అవినీతి కేసులో తీహార్ జైలులో ఉన్న ఆయనకు ఆ అధికారం లేదని సాధారణ పరిపాలన శాఖ(జిఎడి) స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అభీష్టం మేరకు జాతీయ జెండాను అతిషి ఆవిష్కరించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఢిల్లీ జిఎడి మంత్రి గోపాల్ రాయ్ సోమవారం జిఎడిని ఆదేశించారు. దీనిపై జిఎడి అదనపు ముఖ్య కార్యదర్శి నవీన్ కుమార్ చౌదరి మంగళవారం స్పందిస్తూ ముఖ్యమంత్రి ఆదేశాలు చట్టప్రకారం చెల్లవని, వాటిపై తాము చర్యలు తీసుకోలేమని చెప్పారు.

ఇదే విషయమై ముఖ్యమంత్రి ఆగస్టు 6న లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనాకు రాసిన లేఖకు జైలు నిబంధనల ప్రకారం అనుమతి లేదని కూడా ఆయన తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం ఎప్పటిలాగే ఛత్రసాల్ స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతున్నాయని చౌదరి తెలిపారు. ముఖ్యమంత్రి జుడిషియల్ కస్టడీలో ఉన్నందున జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం ఆయనకు సాధ్యపడదని, తదుపరి ఆదేశాల కోసం ఉన్నతాధికారులకు సమాచారం అందచేశామని యన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News