న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ 2021-22ను అమలుచేయడంలో తీవ్ర తప్పిదాలకు పాల్పడినందుకు అప్పటి ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీకృష్ణ, డిప్యుటీ ఎక్సైజ్ కమిషనర్ ఆనంద్ కుమార్ తివారీతోసహా 11 మంది అధికారులను ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ వికె సక్సేనా సస్పెండ్ చేసినట్లు శనివారం వర్గాలు తెలిపాయి. సస్పెండ్ అయిన అధికారులలో ఢిల్లీ, అండమాన్ అండ్ నికోబార్, లక్షద్వీప్, డామన్ అండ్ డయ్యూ, దాద్రా అండ్ నగర్ హవేలీ(సివిల్) సర్వీసెస్(డానిక్స్)కు చెందిన ముగ్గురు తాత్కాలిక అధికారులు, ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ శాఖకు చెందిన ఆరుగురు అధికారులు ఉన్నట్లు ఎల్‌జి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. టెండర్ల ఖరారు, ఎంపికైన వెండర్లకు ప్రయోజనాలు కల్పించడంలో అక్రమాలతోసహా ఎక్సైజ్ పాలసీ అమలులో అధికారులు తీవ్ర తప్పిదాలకు పాల్పడినట్లు తేలడంతో లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ ఇచ్చిన దర్యాప్తు నివేదిక ఆధారంగా సక్సేనా ఈ నిర్ణయం తీసుకున్నారని వారు చెప్పారు. ఈ అక్రమాలపై సిబిఐ దర్యాప్తునకు లెఫ్టినెంట్ గవర్నర్ ఇదివరకే సిఫార్సు చేశారు.
Delhi Lieutenant Governor suspends 11 Exercise Officials