Wednesday, January 22, 2025

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు
బేగంపేట ఎయిర్‌పోర్ట్ ద్వారా నగదు బదిలీ
తెరపైకి శరత్ చంద్రారెడ్డి భార్య పేరు
మన తెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్ కేంద్రంగా నగదు బదిలీ అయినట్లుగా దర్యాప్తు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ జెట్ విమానాల ద్వారా నగదు తరలించినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శరత్ చంద్రారెడ్డి భార్య నడుపుతోన్న కానిక టెక్రివాల్ సంస్థ ద్వారా లావాదేవీలు జరిగినట్లుగా భావిస్తున్నారు. జెట్ సెట్ గో సంస్థ ద్వారా డబ్బులు బదిలీ అయినట్లుగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం జెట్ సెట్ గో సంస్థ సిఇఒగా శరత్ చంద్రారెడ్డి భార్య పనిచేస్తున్నారు. దీంతో దీనిపై ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఇడి వివరాలు కోరింది. గత నెల 17వ తేదీనే ఎయిర్‌పోర్టు అథారిటీకి లేఖ రాసింది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో శరత్ చంద్రారెడ్డిని ఇడి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇకపోతే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఇడి రిమాండ్ డైరీలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ స్కామ్ ఎలా జరిగిందో ఇడి అందులో వివరించింది. అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి రూ.64 కోట్ల వరకు మనీలాండరింగ్‌కు పాల్పడ్డాడని ఇడి తెలిపింది. లంచాలు ఇచ్చేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశాడని తెలిపింది. స్కామ్‌లో అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్, సమీర్ మహేంద్రోలు కీలకపాత్ర పోషించినట్లు తేల్చింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 169 చోట్ల సోదాలు నిర్వహించినట్లు ఇడి తెలిపింది. లిక్కర్ స్కామ్‌లో 34 మంది పాత్ర బయటపడిందని వెల్లడించింది. 6 రిటైల్ జోన్ల కోసం పెద్ద మొత్తంలో ముడుపులను ఇచ్చినట్లు పేర్కొంది. రూ. 100 కోట్ల వరకు లంచాలు ఇచ్చినట్లు తెలిపింది. డిజిటల్ డివైజస్‌తో పాటు రికార్డులు సీజ్ చేశామని స్పష్టం చేసింది. 34 మంది నిందితులు 140 ఫోన్లు మార్చారని, లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చిన వెంటనే ఫోన్లు మార్చినట్లు తెలిపింది.

సెల్‌ఫోన్లు మార్చడం కోసం రూ.1.20 కోట్లు ఖర్చు చేశారని ఇడి తెలిపింది. మరోవైపు శరత్ చంద్రారెడ్డి అరబిందో గ్రూపులోని 12 కంపెనీలకు, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సంస్థలోనూ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో పాటు మద్యం వ్యాపారి వినయ్ బాబులను ఇడి అధికారులు గురువారం అరెస్ట్ చేసి, ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. వీరిని కస్టడీకి అనుమతించాలని ఇడి అధికారులు న్యాయస్థానాన్ని కోరగా కోర్టు వారం రోజుల కస్టడీకి అనుమతించింది. అయితే కొన్ని షరతులను కూడా విధించింది. 24 గంటలకు ఒకసారి నిందితులకు వైద్య పరీక్షలు చేయించాలని అలాగే సిసిటివి పర్యవేక్షణలో వీరిని ప్రశ్నించాలని సూచించింది.

Delhi Liquor Case: Cash delivery by Begumpet Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News