Friday, November 15, 2024

ఢిల్లీ లిక్కర్ స్కాం: అరుణ్ రామచంద్ర పిళ్లైకి ఇడి నోటీసులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబుల కస్టడీని మరో నాలుగు రోజులు పొడిగిస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబు, అరుణ్ రామచంద్రన్ పిళ్లైలను విచార ణకు రావాలని ఇడి ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ నెల 10వ తేదీన శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులను ఇడి అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో సమాచారం రాబట్టేందుకు గాను ఇడి అధికారులు కోర్టు అనుమతితో వారం రోజులుగా కస్టడీలోకి తీసుకున్నారు. గురువారంతో కస్టడీ ముగిసింది. గురువారం మద్యాహ్నం సిబిఐ ప్రత్యేక కోర్టులో శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులను ఇడి అధికారులు సిబిఐ కోర్టులో హాజరుపర్చారు. అయితే నిందితులు విచారణకు సహకరించడం లేదని ఇడి తరపున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరో వారం రోజుల పాటు నిందితులను కస్టడీకి ఇవ్వాలని ఇడి తరపు న్యాయవాదులు కోరారు. వీరితో పాటు మరో ఇద్దరిని కూడా విచార ణకు రావాలని కోరినట్టుగా ఇడి తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబు, అరుణ్ రామచంద్రన్ పిళ్లైలను విచారణకు రావాలని నోటీసులు పంపినట్టుగా కోర్టుకు ఇడి న్యాయవాదులు తెలిపారు.

ఈ నలుగురిని విచారించాలని భావిస్తు న్నామని కోర్టుకు తెలిపారు. ఈ కారణంగానే కస్టడీని పొడిగించాలని ఇడి తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. అయితే నాలుగు రోజుల విచారణకు మాత్రమే సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతిని ఇచ్చింది. రాబిన్ డిస్టిలరీస్ పేరుతో అరుణ్ రామచంద్రన్ పిళ్లై లైసెన్స్ పొందారు. సౌత్ లాబీ పేరుతో హవాలా రూపంలో డబ్బులను తరలించారని ఇడి అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయాలపై నిందితుల నుండి సమాచారాన్ని సేకరించాల్సి ఉందని ఇడి అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే హైద్రాబాద్ కేంద్రంగా పలు దఫాలు ఇడి అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ కేంద్రంగా జరిపిన సోదాల్లో సేకరించిన సమాచారంతోపాటు ఈ కేసులో అరెస్టైన వారిచ్చిన సమాచారం ఆధారంగా ఇడి అధికారులు విచారణ చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిని అరెస్ట్ చేయడం ప్రస్తుతం కలకలం రేపుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డిని ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో మూడు రోజులపాటు ఇడి అధికారులు విచారించారు. అయితే తమ విచారణకు శరత్ చంద్రారెడ్డి సహకరించలేదని ఇడి అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ నెలలో మరోసారి ఆయనను విచారించారు. ఈ నెల 10వ తేదీన అరెస్ట్ చేశారు.

శరత్ చంద్రారెడ్డి భార్య విమాన సంస్థపై ఇడి ఆరా
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇడి మరింత లోతుగా విచారిస్తుంది. ఈ కేసులో అరెస్టైన శరత్ చంద్రారెడ్డి సతీమణి కనికకు సంబంధించిన విమానసంస్థ కార్యకలాపాలపై ఇడి ఆరా తీస్తోంది. ఈ విమానసంస్థ ద్వారా ఢిల్లీకి తెలుగు రాష్ట్రాలు తిరిగిన వారి వివరాలను ఇడి సేకరించింది. ఈ విషయాలపై ఇడి అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు శరత్ చంద్రారెడ్డి భార్య నిర్వహిస్తున్న విమాన సంస్థ ద్వారా ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్లారు? అనే విషయాలపై ఇడి దృష్టి సారించింది. ఈ కేసులో తెలుగు రాష్ట్రాల్లో ఇడి అధికారులు పలు దఫాలు సోదాలు నిర్వహించారు. తెలంగాణ, ఎపి రాష్ట్రాల్లో విచారణ చేశారు. హైద్రాబాద్ లో పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని చార్టెడ్ అకౌంటెంట్ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన సమయంలో కీలక సమాచారాన్ని ఇడి అధికారులు సేకరించారు. మరో వైపు ఇదే కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సిబిఐ అధికారులు విచారించిన విషయం తెలిసిందే .మరో వైపు ఇదే కేసులో బోయినపల్లి అభిషేక్ రావు, విజయ్ నాయర్‌లు కూడా అరెస్టయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News