Sunday, January 19, 2025

ఢిల్లీ లిక్కర్ స్కాం రిమాండ్ రిపోర్టులో కల్వకుంట్ల కవిత పేరు..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఢిల్లీ మద్యం స్కామ్ రిమాండ్ రిపోర్టులో కల్వకుంట్ల కవిత పేరును ఇడి అధికారులు చేర్చారు. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును చేర్చినట్లుగా ఇడి పేర్కొంది. మంగళవారం రాత్రి అమిత్ ఆరోరాను ఇడి అధికారులు అరెస్ట్ చేశారు. అలాగే సౌత్ గ్రూప్ సంస్థ వంద కోట్ల రూపాయల ముడుపులను చెల్లించినట్లు తేల్చారు. సౌత్ గ్రూప్‌ను శరత్‌రెడ్డి, కవిత, వైసిపి ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి నియంత్రించేవారని ఇడి వెల్లడించింది. ఈ గ్రూపు ద్వారా రూ.వంద కోట్లను విజయ్‌నాయర్‌కు చేర్చినట్లు ఇడి తమ విచారణలో బట్టబయలు చేసింది.

ఇడి చేసిన దర్యాప్తులో అమిత్ ఆరోరా వాగ్మూలంలో ఈ విషయాలను స్పష్టంగా ధృవీకరించినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. 36 మంది రూ.1.38 కోట్లు విలువ చేసే 170 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేసినట్లు ఇడి అధికారులు తెలిపారు. వీటిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురి 33 ఫోన్లను మాయం చేశారన్నారు. ధ్వంసం చేసిన సెల్‌ఫోన్లలో రెండు కవిత నెంబర్లు, పది మొబైల్ ఫోన్‌లు వాడినట్లు ప్రకటించారు. ఆమె వాడిన ఈ ఫోన్లు కనిపించకుండా పూర్తిగా ధ్వంసం చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

కుంభకోణంతో ప్రమేయం ఉన్న భాగస్వాములు, అనుమానితుల ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ధ్వంసం చేశారని ఇడి అధికారులు గుర్తించారు. సాక్షాధారాలు, ముడుపుల వివరాలున్న డిజిటల్ డేటాను కూడా పూర్తిగా కనిపించకుండా చేశారని ఇడి దర్యాప్తులో తేలింది. వీరి వద్ద నుంచి కేవలం 17 ఫోన్లను మాత్రమే రికవరీ చేసినట్లు కోర్టుకు వివరించారు. ఈ స్కామ్‌లో ఎందరో మద్యం వ్యాపారులు, సీనియర్ ప్రభుత్వ అధికారులు ఉన్నారని తమ విచారణలో ఇడి అధికారులు గుర్తించారు. ప్రధాన నిందితుల్లో ఢిల్లీ ఎక్సైజ్ శాఖ మంత్రి ఒకరు ఉన్నారని ఇడి ప్రకటించింది.

Delhi Liquor Scam: MLC Kavitha Name appears in ED Chargesheet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News