ఢిల్లీ పోలీసుల అదుపులో యువకుడు
న్యూఢిల్లీ: పోలీసు కంట్రోల్ రూముకు ఫోన్ చేసి ప్రధాని నరేంద్ర మోడీని చంపుతానని బెదిరించిన ఒక 22 ఏళ్ల యువకుడిని ఈశాన్య ఢిల్లీలోని ఖజూరి ఖాస్ ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేశారు. అతడిని సల్మాన్ అలియాస్ అర్మాన్‌గా పోలీసులు గుర్తించారు. జైలుకు వెళ్లేందుకే తాను ఆ రకంగా బెదిరించినట్లు అతను పోలీసులకు చెప్పాడు. 2018లో ఒక హత్య కేసులో అరెస్టయి బాల నేరస్తుల గృహానికి వెళ్లిన నిందితుడు ఇటీవలే విడుదలయ్యాడని, అతను మాదక ద్రవ్యాలకు బానిసయ్యాడని పోలీసులు తెలిపారు.
గురువారం అర్ధరాత్రి 112 నెంబర్‌కు డయల్ చేసి ప్రధాని మోడీని చంపుతానని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. ఎక్కడ నుంచి ఆ ఫోన్ కాల్ వచ్చిందో వెంటనే గుర్తించిన పోలీసు కంట్రోల్ రూము సిబ్బంది ఈ సమాచారాన్ని జిల్లా పోలీసులకు అందచేశారు. ఈ నంబర్ ఖజూరీ ఖాస్ నుంచి వచ్చినట్లు వారు గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ చేసిన సమయంలో అతను డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. రాత్రి 10 గంటల ప్రాంతంలో అర్మాన్‌ను అతని తండ్రి మందలించినట్లు పోలీసులు చెప్పారు. ఎందుకు ఫోన్ చేశావని పోలీసులు అతడిని ప్రశ్నించగా తనకు జైలంటే ఇష్టమని, అక్కడకు వెళ్లాలనే ఫోన్ చేశానని అతను చెప్పినట్లు పోలీసులు చెప్పారు. చట్టపరమైన చర్యలు చేపట్టేముందు అతడిని ఐబి అధికారులతో కలసి ఢిల్లీ పోలీసుకు చెందిన సీనియర్ అధికారులు మళ్లీ ప్రశ్నించనున్నారు.