ఢిల్లీ: ఢిల్లీ మేయర్ ఎన్నిక తేదీ ఖరారయింది. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన ఎన్నికకు తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో మార్గం సుగమం అయ్యింది. ఈ మేరకు ఎన్నిక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఎంసిడి కార్యనిర్వాహక విభాగం. ఫిబ్రవరి 22వ తేదీన ఢిల్లీ మేయర్ ఎన్నిక నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అదే రోజున మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా నిర్వహిస్తారు.
ఎంసిడి సదన్‌లో ఫిబ్రవరి 22(బుధవారం) ఉదయం 11.00 గంటలకు ఈ ఎన్నిక జరుగనుంది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక తర్వాత ఆరుగురు సభ్యులుండే స్టాండింగ్ కమిటీని అదేరోజు ఎన్నుకుంటారు. ఎన్నికల ఫలితాలు వెలువడి రెండు నెలలు గడుస్తున్నా…ఇంకా మేయర్ పదవికి ఎన్నిక జరగకపోవడం గమనార్హం.
ఎన్నికల్లో ఆప్ విజయం సాధించగా, బిజెపి ఓటమి పాలైంది. మొదట మేయర్ పదవికి పోటీచేయబోమని ప్రకటించిన బిజెపి చివరి నిమిషంలో అభ్యర్థులతో నామినేషన్ వేయించింది. ఆ తర్వాత మూడుసార్లు మేయర్ ఎన్నిక కోసం హౌజ్ సమావేశం కాగా, బిజెపిఆప్ సభ్యులు పరస్పర ఆరోపణలు చేసుకోగా, ఎన్నిక వాయిదా పడింది. ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా సత్య శర్మను నియమించడం దగ్గరి నుంచి నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు కల్పించడం దాకా అంతా బిజెపికి అనుకూలంగా జరుగుతోందని, లెఫ్టినెంట్ గవర్నర్ ఇదంతా బిజెపికి అనుకూలంగా చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించింది ఆప్.