న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ ఉప ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జయభేరి మోగించింది. మొత్తం ఐదు వార్డుల్లో ఉపఎన్నిక నిర్వహించగా నాలుగు స్థానాల్లో ఆప్, ఒక స్థానంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఖాతా తెరవలేదు. ఈ విజయంపై పార్టీ కార్యకర్తలకు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బిజెపితో ప్రజలు విసుగు చెందారని విమర్శించారు. వచ్చే ఏడాది జరిగే మున్సిపల్ ఎన్నికలలో అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో ఢిల్లీ ప్రజలు ఆప్ ను అద్భుతమైన మెజార్జీతో అధికారాన్ని కట్టబెడతారని ఆయన తెలిపారు.
ఈ విజయంపై ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ.. “ఢిల్లీ ప్రజలు మరోసారి సుపరిపాలన కోసం ఓటు వేశారు. ఫలితాలను నేను అభినందిస్తున్నాను. ఎంసిడిలలో బిజెపి పాలనతో ప్రజలు 15 సంవత్సరాలు విసిగిపోయారు. ఎంసిడిలలో ఆప్‌ను అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు ఆసక్తిగా ఉన్నారు.” అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. గత నెల 28న కళ్యాణ్‌పురి, త్రిలోక్‌పురి ఈస్ట్, షాలిమార్ బాగ్, రోహిణి-సి, చౌహాన్ బాంగర్ వార్డులకు జరిగిన ఉపఎన్నికల్లో 50 శాతంపైగా ఓటింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు. అయితే, బిజెపి పార్టీ విఫలమైన పనితీరుపై ఢిల్లీ బిజెపి చీఫ్ అదేష్ గుప్తా స్పందిస్తూ “ఈ ఉప ఎన్నికలలో పార్టీ కార్యకర్తలు చాలా కష్టపడ్డారు. మేము ఫలితాన్ని విశ్లేషిస్తాము. ఎక్కడ తప్పు జరిగిందో చూస్తాము. మునిసిపల్ ఎన్నికలకు సిద్ధం కావడానికి మాకు ఇంకా చాలా సమయం ఉంది.” అదేష్ గుప్తా వివరణ ఇచ్చారు.