Saturday, December 21, 2024

నేటి నుంచి తొలి ర్యాపిడ్ రైలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలోని రైల్వే విభాగంలో మరో సరికొత్త ఘట్టం ఆవిష్కృతం కానుంది. శుక్రవారం నుంచి ర్యాపిడెక్స్ పేరిట భారతీయ రైల్వే దేశ ప్రజలకు వేగవంత ప్రయాణంలో భాగంగా తొట్టతొలి ఢిల్లీ మీరట్ ర్యాపిడ్ రైలును ప్రారంభించనుంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇప్పుడు అధునాతన రీతిలో సెమీ హైస్పీడ్ రైళ్లుగా నడుస్తున్నాయి. ఇప్పుడు అత్యంత వేగంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే హై స్పీడ్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు. ఇందులో కొద్ది సేపు ప్రయాణిస్తారు. ఢిల్లీ మీరట్ మధ్య ప్రయాణ సమయాన్ని ఈ రైలు గణనీయంగా తగ్గిస్తుంది.

దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైళ్లకు సంబంధించిన, ప్రాంతీయ వేగవంత ప్రయాణాల వ్యవస్థ (ఆర్‌ఆర్‌టిఎస్) ప్రాజెక్టుకు 2019 మార్చిలో ప్రధాని నరేంద్ర మోడీ అంకురార్పణ చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా తొలి రైలు నేడు (శుక్రవారం) పట్టాలపై దూసుకువెళ్లనుంది. మొత్తం 82 కిలోమీటర్ల ఢిల్లీ మీరట్ రైలు మార్గంలో ఇప్పటికీ 17 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయింది. మొత్తం రైలు మార్గ నిర్మాణం 2025 జూన్‌కు అందుబాటులోకి వస్తుంది. కాగా ఇప్పుడు ఈ ర్యాపిడ్ రైలు ఢిల్లీ ఘజియాబాద్ మీరట్ ప్రియార్టీ సెక్షన్‌లోని పూర్తయిన 17 కిలోమీటర్ల పరిధిలో దూసుకువెళ్లుతుంది.

ఈ ర్యాపిడ్ రైళ్లు పలు సౌకర్యాలతో ఉంటాయి. మెట్రోట్రైన్స్ మాదిరిగానే ఉండే ఈ రైళ్లు పలు విధాలుగా ప్రయాణికుల సౌకర్యాలను సంతరించుకుంటాయి. ప్రత్యేకంగా లగేజ్ కేరియర్లు, చిన్నపాటి స్క్రీన్‌లో బోగీలలో నెలకొని ఉంటాయి. వైఫై కనెక్షను, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌ల ఛార్జింగ్ ఏర్పాట్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ప్రతి ర్యాపిడ్ రైలులోనూ ఒక డీలక్స్ క్లాస్ కోచ్ ఉంటుంది. ఇందులో విశాలమైన సీట్ల ఏర్పాట్లు, సౌకర్యవంతమైన కూర్చునే వెసులుబాట్లు, కోట్ హాంగర్స్ కూడా ఉంటాయి. ర్యాపిడ్ రైలు ప్రాజెక్టులో భాగంగా ఇప్పుడు ఆరంభం అయ్యే ఢిల్లీ మీరట్ రైలులో ఐదు స్టేషన్లు ఉంటాయి. ప్రధాని మోడీ ఈ ర్యాపిడెక్స్ రైలును శుక్రవారం లాంఛనంగా ప్రారంభించిన తరువాత శనివారం నుంచి వీటిని ప్రయాణికులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News