Monday, January 20, 2025

ఢిల్లీ ఆప్ ప్రభుత్వంలో కలకలం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాస్ గెహ్లాట్ సొంత ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఆయన ఆదివారం మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆప్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ప్రజా సంక్షేమం బాట నుంచి దారి తప్పిందని కైలాస్ గెహ్లాట్ ఆరోపించారు. ఇక మీదట తాను మంత్రిగా కొనసాగలేనని అంటూ కైలాస రాజీనామా ప్రకటన చేశారు. అంతే కాదు, పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఢిల్లీ శాసనసభ ఎన్నికలు జరగనుండగా, ఆప్‌పై ఈ పరిణామం ప్రభావం చూపనున్నది. కైలాస్ గెహ్లాట్ ఆదివారం ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్‌కు ఒక లేఖ రాశారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నివాసం ఉన్న భవనానికి రూ. 45 కోట్లతో పునరుద్ధరణ పనులు అవసరమా అని కైలాస్ తన లేఖలో ప్రశ్నించారు. ‘శీష్‌మహల్’ వంటి ‘ఇబ్బందికర’ వివాదాల గురించి ఆయన ప్రస్తావించారు.

విలాస వస్తువులపై, ఆధునిక సదుపాయాలపై కేజ్రీవాల్ కోట్ల రూపాయలు వెచ్చించారని బిజెపి నేతలు ఆరోపించిన నేపథ్యంలో కైలాస్ గెహ్లాట్ ‘శీష్‌మహల్’ వివాదాన్ని ప్రస్తావించారు. కేజ్రీవాల్ గత నివాస భవనాన్ని ‘శీష్‌మహల్’గా బిజెపి అభివర్ణించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రస్తుతం ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని, ఈ సవాళ్లు వెలుపల నుంచి కాదని, పార్టీలోనే ఆని ఆయన స్పష్టం చేశారు. ‘ప్రజల పట్ల మన నిబద్ధతను రాజకీయ ప్రయోజనాలు తొక్కేస్తున్నాయి. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదు’ అని కైలాస్ గెహ్లాట్ తన లేఖలో విమర్శనాస్త్రాలు సంధించారు. కైలాస్ గెహ్లాట్ రాజీనామాను ముఖ్యమంత్రి ఆతిశీ ఆమోదించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇది ఇలా ఉండగా, గెహ్లాట్ ఇడి, సిబిఐ కేసులు ఎదుర్కొంటున్నారని, ఆయనకు బిజెపిలో చేరడం మినహా మార్గాంతరం లేదని ఆప్ నేతలు ఆరోపించారు. కాగా, గెహ్లాట్ రాజీనామాను ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా స్వాగతించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News