Wednesday, January 22, 2025

ప్రజాస్వామ్యానికి పరీక్ష ఢిల్లీ బిల్లు

- Advertisement -
- Advertisement -

భారత్ ప్రజాస్వామ్యానికి మాతృక అని, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని మన ప్రధాని నరేంద్ర మోడీతో పాటు మనమంతా గర్వంగా చెప్పుకొంటుంటాము. మనతో పాటు స్వాతంత్య్రం పొంది, ప్రజాస్వామ్య వ్యవస్థలు చేపట్టిన సుమారు 60 ఆసియా, ఆఫ్రికా దేశాల్లో నేడు ఏదో ఒక విధమైన నిరంకుశ పాలనలో నడుస్తున్నాయి. కేవలం మన దేశంలో మాత్రమే క్రమం తప్పకుండా ఎన్నికలు జరుగుతూ ఉండటం, బలమైన ప్రభుత్వాలు సహితం బ్యాలట్ ద్వారా మారుతూ ఉండటం జరుగుతూ వస్తున్నది. ఎమర్జెన్సీ వంటి కఠిన సమయాన్ని సహితం ఎంతో ప్రశాంతంగా అధిగమించాము. అయితే తాజాగా మన పార్లమెంట్ ఆమోదం పొందుతున్న ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం (సవరణల) బిల్లు 2023 మాత్రం మన ప్రజాస్వామ్యానికి విషమ పరీక్షగా మారిందని చెప్పవచ్చు.

ఈ బిల్లులోని అంశాలను ప్రజాస్వామ్య మౌలిక విలువలనే కాలదన్నే విధంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన, వ్యతిరేకించిన రాజకీయ పక్షాలు దాదాపుగా తమ, తమ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వ్యవహరించాయి. అయితే, రెండు వారాలుగా పార్లమెంట్ కార్యకలాపాలు జరగకుండా అడ్డుకుంటున్న పక్షాలు ఈ బిల్లుపై చర్చ కోసం ఆసక్తి చూపడం ఒక విధంగా హర్షణీయం. ఈ బిల్లును తీసుకు వచ్చిన నేపథ్యం భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉండేందుకు దోహదపడుతుంది. ప్రజాస్వామ్యంలో ఇటువంటి కీలక బిల్లులను తీసుకు వచ్చే సమయంలో వివిధ పక్షాలతో, నిపుణులతో సంప్రదింపులు జరపడం ఓ నాగరిక ప్రభుత్వ సంప్రదాయంగా ఉండాలి.

కానీ, ఈ బిల్లును ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొచ్చిందని చెప్పవచ్చు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వమ్ము చేసేందుకు హడావుడిగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును తీసుకువచ్చారు. అందుకు చెప్పుకోదగిన కసరత్తు చేసిన్నట్లు కనబడటం లేదు. ఈ సందర్భంగా హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సహితం ఆందోళన కలిగిస్తున్నాయి. రాజకీయ నిబద్ధతను ప్రశ్నించే విధం గా చేస్తున్నాయి. ఢిల్లీకి అసలు ఎప్పుడూ పూర్తి స్థాయి రాష్ట్ర హోదా లేదని, అటువంటి హోదాను జవహర్ లాల్ నెహ్రూ, అంబేడ్కర్ వంటి వారు వ్యతిరేకించారని చెప్పుకొచ్చారు.

అయితే స్వయంగా బిజెపి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడల్లా తమ ఎన్నికల ప్రణాళికలో ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా తీసుకు వస్తామని హామీ ఇవ్వలేదా? వాజపేయి, ఎల్‌కె అద్వానీ, మదన్ లాల్ ఖురానా వంటి బిజెపి అగ్రనేతలు అందుకోసం కృషి చేయలేదా? ఇప్పుడు ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఏర్పడటంతో అధికారాల విషయంలో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాల మధ్య వివాదం ఏర్పడిందని, అంతకు ముందు లేదని చెప్పడం ద్వారా అమిత్ షా పరోక్షంగా తమ ప్రభుత్వం నిరంకుశ ధోరణులను వెల్లడి చేసినట్లయింది. ఢిల్లీ ప్రభుత్వ అధికారుల నియామకం, బదిలీల విషయంలో ఆప్ ప్రభుత్వం ఏర్పడే వరకు ఢిల్లీ ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉంటూ వచ్చాయి. కేంద్రంలో, ఢిల్లీలో విభిన్న పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో సహితం ఈ విషయంలో ఎటువంటి సమస్యలు ఏర్పడలేదు. వాజపేయి ప్రభుత్వ హయాంలో షీలా దీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో రెండు ప్రభుత్వాల మధ్య ఎటువంటి ఘర్షణ చోటు చేసుకోలేదు. కేవలం 2015లో ఆప్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఢిల్లీ ప్రభుత్వ అధికారులపై కేంద్రం పెత్తనం ప్రారంభం కావడంతో వివాదాలు తలెత్తుతున్నాయి.

ఈ బిల్లులో అధికారుల నియామకం, బదిలీలకు సంబంధించి ఏర్పడే బోర్డులో ముఖ్యమంత్రితో పాటు ఇద్దరు కేంద్రం నియమించిన అధికారులు ఉంటారు. అంటే ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి నిర్ణయాలను కేంద్రం నియమించిన ఆ ఇద్దరు అధికారులు తలకిందులు చేయగలరు. కేవలం కమ్యూనిస్ట్, నిరంకుశ వ్యవస్థలలో మాత్రమే ప్రజలు ఎన్నుకున్న నేతలకు ఇటువంటి అవమానకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఎన్నికల ద్వారా ఏర్పడిన ప్రభుత్వ అధినేతలకు అధికారులను నియమించుకోవడంలో కొంత స్వేచ్ఛ ప్రజాస్వామ్యంలో ఉంటుంది. కేంద్రంలో ప్రధాని అయినా, రాష్ట్రాలలో ముఖ్యమంత్రులైనా అటువంటి స్వేచ్ఛను కలిగి ఉంటారు. కానీ ఢిల్లీలో లేకుండా చేయడంలో ఆంతర్యం ఏమిటి? ఎట్లాగూ దేశ రాజధాని కావడంతో పోలీసు, రెవెన్యూ, భూములు వంటి అంశాలలో కేంద్రమే నిర్ణయాధికారిగా ఉంటుం ది. కనీసం విద్య, వైద్యం, ఇతర పరిపాలనాపర వ్యవస్థలపై కూడా ముఖ్యమంత్రికి అధికారం లేకుండా చేయడం చాలా విషాదకర పరిణామం అని చెప్పాల్సిందే.

పూర్తి రాష్ట్ర హోదా గల జమ్మూకశ్మీర్‌ను అసెంబ్లీని అర్ధాంతరంగా రద్దు చేసి ఏకపక్షంగా రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. అసెంబ్లీకి ఏడాదిలోగా ఎన్నికలు జరుపుతామని పార్లమెంట్ వేదికగా హామీ ఇచ్చారు. నాలుగేళ్లయినా ఎన్నికల ఊసే ఎత్తడంలేదు. ఢిల్లీలో పాక్షికంగా అయినా రాష్ట్ర హోదా కలిగి ఉంటున్న ఢిల్లీని ఒక మున్సిపల్ కార్పొరేషన్ స్థాయికి కుందించే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలోకి రాగానే ‘సహకార ఫెడరలిజం’ వ్యవస్థ అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వాములుగా పని చేయాలని ప్రధాని మోడీ చెబుతూ వచ్చారు. ముఖ్యంగా నాటి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ మాటను తరచూ ప్రస్తావిస్తూ ఉండేవారు. పనుల్లో రాష్ట్రాల వాటాను పెంచుతున్నామని చెప్పారు.

కానీ ఆచరణలో ఏమి జరుగుతుంది? కేంద్ర పథకాల సంఖ్య పెరిగిపోతూ వాటికి మాత్రమే రాష్ట్రాలకు నిధులు సమకూరుస్తూ, రాష్ట్రాలు సొంతంగా పథకాలు అమలు పరచుకోలేని పరిస్థితి ఏర్పడింది. కేంద్రం తనకు ప్రత్యేకంగా ఎటువంటి యంత్రాంగం లేకపోయినా జిఎస్‌టిని తీసుకు వచ్చి మొత్తం పన్నుల ఆదాయాన్ని తన చేతుల్లోకి తెచ్చుకొని రాష్ట్రాలు ఉద్యోగుల జీతాలు చెల్లించుకునేందుకు కూడా ప్రతి నెలా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయవలసిన పరిస్థితులు ఏర్పరిచారు. రాష్ట్రానికి రావాల్సిన జిఎస్‌టి బకాయిల విషయంలో సహితం సహేతుకంగా వ్యవహరించడం లేదు. మొత్తం ఆర్థిక వనరులను తమ కబంధ హస్తాలలోకి మార్చుకొని తామిచ్చే నిధులతో రాష్ట్రాలు తమ పేర్లతో పథకాలు అమలు చేస్తున్నాయని అంటూ ఎద్దేవా చేస్తున్నారు. భారీ ప్రాజెక్ట్‌లకు నిధుల కేటాయింపులలో సహితం వివక్ష చూపుతున్నారు. అభివృద్ధి అంశాలు కాకుండా రాజకీయ అంశాలను ప్రాధాన్యత సంతరింప చేసుకొంటున్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధికార కేంద్రీకరణ జరుగుతుంది.

‘భిన్నత్వంలో ఏకత్వం’ భారతీయ ఘనతగా చెప్పుకొంటుంటా ము. ప్రపంచంలో ఎక్కడా లేనన్ని భాషలు, మతాలు, రంగులు, వేషధారణలు, ఆహారపు అలవాట్లు, సంప్రదాయ పద్ధతులు, ఆరాధన పద్ధతులు కలిగి ఉండటమే మన దేశానికి బలంగా భావిస్తుంటాము. కానీ నేడు అన్ని ఒకే విధంగా ఉండాలనే ధోరణులు పెరుగుతున్నాయి. ‘ఒకే దేశం ఒకే పన్ను’ నుండి ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ వరకు ఇటువంటి ధోరణులు మన వైవిధ్యాన్ని దెబ్బ తీస్తున్నాయి.

తద్వారా దేశ సమగ్రతను ప్రశ్నార్ధకం భావిస్తున్నాయి. ఢిల్లీలో అధికార కేంద్రీకరణ జరిగినా అక్కడైనా రాజకీయ నాయకత్వం అజమాయిషీ ఉండటం లేదు. మంత్రులు ఉత్సవ విగ్రహాలుగా మారుతున్నారు. మొత్తం ప్రధాన మంత్రి కార్యాలయంలో అధికారులు కేంద్రీకృతం అవుతున్నాయి. గతంలో ప్రధాన మంత్రి కార్యాలయంలో కేవలం ఒక కార్యదర్శి మొత్తం వ్యవహారాలు చూస్తూండేవారు. అధికార కేంద్రీకరణ ప్రారంభమైన ఇందిరా గాంధీ హయాంలో అక్కడ ఐదుగురు అధికారులు ఉండేవారు. ఆ అధికారుల సంఖ్య మన్మోహన్ సింగ్ హయాంలో 100కు పెరిగింది. ఇప్పుడు ఆ సంఖ్య నాలుగైదు రెట్లు పెరిగింది. ఈ ధోరణి మన ప్రజాస్వామ్యానికి హానికరం. అక్కడైనా నిపుణులు లోతుగా అధ్యయనం జరిపి నిర్ణయాలు తీసుకుంటున్న దాఖలాలు లేవు.

ఉద్యోగ విరమణ జరిపిన ఓ అధికారి రెండు మూడేళ్ళ తర్వాత కూడా తాను అక్కడ లేకపోతే ప్రభుత్వం పని చేయడం కష్టం అన్న రీతిలో ఇడి డైరెక్టర్ పదవీ కాలం పొడిగింపు గురించి సుప్రీంకోర్టులో కేంద్రం చేసిన వాదన ఈ ప్రభుత్వ బలహీనతను వెల్లడి చేస్తున్నది. మోడీ మొదటి ఐదేళ్ల పదవీ కాలంలో అత్యంత పలుకుబడి గల మంత్రి ఎవ్వరంటే అరుణ్ జైట్లీ అని చెప్పవచ్చు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నుండి ఆయనతో కలిసి పని చేయడంతో ఆయనకు అటువంటి సౌలభ్యం ఏర్పడింది. కానీ ఆయన ఎంతో కసరత్తు చేసి రూపొందించిన బడ్జెట్‌నే 60% వరకు ప్రధాని కార్యాలయంలోని ఎటువంటి జవాబుదారీతనం లేని ఒకరిద్దరు అధికారులు మార్చివేస్తుండివారు.

ఇప్పుడు మంత్రులు తమ పిఎస్ సహితం సొంతంగా నియమించుకోలేని దుస్థితిలో ఉన్నారు. ఢిల్లీ పాలనా యంత్రాంగంపై కేంద్ర ప్రభుత్వం తన పర్యవేక్షణ అవసరం అని భావించవచ్చు. అయితే, ఆచరణలోకి తీసుకొచ్చే ముందు విస్తృతంగా వివిధ బాధ్యులతో సంప్రదింపులు జరపడం ప్రజాస్వామ్య వ్యవస్థలో కనీస బాధ్యత. కనీసం ఢిల్లీ ముఖ్యమంత్రిని ఈ విషయంలో సంప్రదించారా? ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం ఉంటే అసలు ఇటువంటి బిల్లు ఆలోచన వచ్చి ఉండెడిదా? సుప్రీంకోర్టు కేంద్రాన్ని తప్పుబడుతూ తీర్పు ఇవ్వని పక్షంలో ఈ చర్యకు పాల్పడేవారా? ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వాలు తీసుకొనే నిర్ణయాలను రాజకీయ అంశాలను ప్రభావితం చేస్తుంటాయి.

అందులో ఎటువంటి అభ్యంతరం ఉండదు. కానీ నిర్ణయాలు తీసుకునేందుకు ఒక పారదర్శకమైన ప్రక్రియను అనుసరించడం అత్యవసరం. రేపు కేంద్రంలో మరో పార్టీ అధికారంలోకి వచ్చి, ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం ఏర్పడితే ఇటువంటి ఏర్పాటును బిజెపి సమర్థిస్తుందా? ఒక వ్యక్తిని, ఒక పార్టీని దృష్టిలో ఉంచుకొని ఇటువంటి కీలక బిల్లులను అర్ధాంతరంగా తీసుకొచ్చే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా వ్యతిరేకం అవుతుంది. ఈ బిల్లుపై జరిగిన చర్చలో కూడా ప్రతిపక్షాలు ఏర్పాటు చేసుకున్న కూటమిపై దాడి చేసేందుకు ఎక్కువగా అమిత్ షా ప్రయత్నం చేశారంటే రాజకీయ ప్రత్యర్థుల ఉనికిని సహించలేని ఒక అసాధారణమైన వాతావరణం దేశంలో ఏర్పడుతున్నదని ఆందోళన కలుగుతున్నది. ఎమర్జెన్సీని మరిపించే ఆలోచనా ధోరణులు తీవ్రం అవుతున్నాయనే భయం కలుగుతున్నది.

* చలసాని నరేంద్ర- 9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News